కలవర పెడుతున్న గుండెపోటు మరణాలు.. ఐదు రోజుల్లో..

by Sumithra |
కలవర పెడుతున్న గుండెపోటు మరణాలు.. ఐదు రోజుల్లో..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇంట్లోనే శ్రీకాంత్ అనే యువకుడు గుండెపోటుతో చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీరాంనగర్ లో బుధవారం ఉదయం జరిగింది. ఈ నెల 7న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యాల్ కల్ రోడ్డులో దేవుని పూజ కోసం గుడికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు మచల్ శ్రీనివాస్ (41) గుండెపోటుతో చనిపోయాడు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో హార్ట్ ఎటాక్ లు కలవరపెడుతున్నాయి. ఇప్పుడు వరుసపెట్టి జరుగుతున్న మరణాల్లో గుండెపోటు ప్రధానంగా కనిపిస్తుంది. ఐదు రోజుల్లో కామారెడ్డి జిల్లాలో నలుగురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మరణించారు. అధికారికంగా తెలిసిన మరణాల సంఖ్యనే ఆరుగురు ఉండగా లెక్కలకు రాని మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు.

అయితే కరోనా తర్వాత వచ్చే పోస్టుకోవిడ్ అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఉందనే అంశం అందరినీ కలవరపెడుతుంది. ముఖ్యంగా ఒక వయస్సు మలిదశలో వచ్చే గుండెపోటు యువతలో రావడం, పిట్టల్లా రాలడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గుండెపోటు వచ్చిన వారిని కాపాడేందుకు గాను సీపీఆర్ కిట్ లను వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ముఖ్యంగా నేటి కాలంలో ఆధునిక జీవనశైలి కారణంగా గుండెపోటు ప్రధాన సమస్యగా మారింది. శారీరక శ్రమ తగ్గడంతో పాటు వ్యాయామాలు చేయకపోవడం కారణమని చెబుతున్నారు వైద్యులు.

గుండె కండరాలలో బ్లాకేజ్ లేదా ప్రతికూల సమస్యల కారణంగా కొరోనరీ ఆర్టరీ (ధమనుల) లో రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించబడడం మూలంగా గుండెపోటు సంభవిస్తుంది. కరోనరీ ఆర్టరీ బ్లాకేజ్ గుండె కండరాలలోని కణజాలాలకు ప్రాణవాయువును నిరోధిస్తుంది. ఎక్కువ సందర్భాలలో, హృదయ ధమనులలో రక్తం గడ్డకట్టడం, తద్వారా గుండె కండరాలకు రక్త ప్రవాహం ఆగిపోవడం వంటివి జరగడం కారణాన, ఛాతీ నొప్పి ఇతర గుండె పోటు లక్షణాలకు దారితీస్తుంది. గుండెపోట్లు గుండె కండరాలకు బలహీనత, శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయి. క్రమంగా వ్యక్తి మరణానికి కూడా కారణమవుతుంది. ఆధునిక జీవితంలో ఆహారపు అలవాట్లు, నిరంతరం పనిఒత్తిడి, వివిధ రకాల ఆందోళనలు, కాలుష్యం వంటివి మన ఆరోగ్యం పై పెను ప్రభావమే చూపిస్తుంటాయి. ముఖ్యంగా గుండెపోటుకు కారణాల్లో ఇదే ముఖ్యమైనది. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం, ఒత్తిడిని జయించడం, అవసరమైన మందులతో గుండెపోటు సమస్యను నివారించవచ్చ.

ఎందుకంటే గుండెపోటు అనేది ప్రాణాంతకమైంది. ఒక్కోసారి సమయం కూడా ఇవ్వదు. ఒకే ఒక స్ట్రోక్‌తో ప్రాణాలు తీసేస్తుంది. సరైన్ ఆహారం తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఊబకాయం ప్రధాన కారణాలు. అందుకే ఇటీవలి కాలంలో యువతలో కూడా గుండెపోటు సమస్య అధికమైంది. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు అధికంగానే ఉంటున్నాయి. సకాలంలో కొన్ని లక్షణాల ద్వారా గుండెపోటు ముప్పును ముందే గుర్తించవచ్చ. ఛాతీనొప్పి, తీవ్రమైన ఒత్తిడి, అసౌకర్యంగా ఉండటం గుండెపోటు వచ్చే ముందు లక్షణాలే.

కొందరికి ఛాతీ మధ్యలో కాస్త నొప్పి లేదా అసౌకర్యంగా ఉండవచ్చు. సాధారణంగా ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. అదే ప్రమాదకరంగా మారుతుంది. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆకస్మిక మైకం వంటివి కలిగినా విస్మరించకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే గుండెజబ్బులో ఇది సర్వ సాధారణ లక్షణం. మైకం వచ్చినట్టుండటం కానీ..మూర్ఛ కానీ ఉన్నా ప్రమాదకరమే. ఒళ్లంతా చెమటలు పట్టి..వికారంగా ఉండటం కూడా గుండెపోటు లక్షణం కావచ్చు.

Advertisement

Next Story

Most Viewed