విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

by Sridhar Babu |
విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, బోధన్ : ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న విద్యారంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల/పాఠశాల భవనాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టపర్చడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు.

ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలన్నీ సొంత భవనాల్లో కొనసాగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 80 రోజుల వ్యవధిలోనే సుమారు 30 నుండి 35 వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేశారని, అందులో అధ్యాపకుల నియామకాలు సైతం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకునేలా వారికి నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు.

విద్యార్థులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలకు తన నియోజకవర్గ నిధుల నుండి 25 కంప్యూటర్లను సమకూరుస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడే పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వసతులతో నూతనంగా అందుబాటులోకి వచ్చిన భవన సముదాయంతో విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా బోధన జరపాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం వర్చువల్ గా ప్రారంభించారు. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలం సాటాపూర్ సమీపంలో నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్, కళాశాల భవనాన్ని, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ పరిధిలోని మోపాల్ మండలం కంజర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు ప్రారంభోత్సవాలు చేశారు.

సాటాపూర్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొనగా, కంజర్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యేలు భవన సముదాయంలోని వివిధ విభాగాలను లాంఛనంగా ప్రాంరంభించారు.

ఈ కార్యక్రమంలో రెంజల్ జెడ్పీటీసీ మ్యాక విజయ సంతోష్, ఆర్డీఓ రాజాగౌడ్, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ రజిత యాదవ్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, ఆర్.సీ.ఓ బషీర్, వహీద్, మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్షియా, వహీద్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మోబిన్ ఖాన్, రెంజల్, బోధన్, నవీపేట్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed