బోధన్ జిల్లా ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం..

by Sumithra |
బోధన్ జిల్లా ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం..
X

దిశ, నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కిడ్నీ రోగుల కోసం ఉచిత డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆస్పత్రిలో డయాలసిస్ సేవల విభాగాన్ని ఆదివారం ప్రారంభించారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సగటున ఇరవై మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చని అక్కడి వైద్యులు కలెక్టర్ కు వివరించారు. చుట్టుపక్కల మండలాల నుంచి డయాలసిస్ పేషంట్లు ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో ఏడుగురు చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.

ఆస్పత్రిలోని ఆర్ఓ ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను కూడా కలెక్టర్ సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్ పేషంట్లను పలకరించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, తహశీల్దార్ కె.గంగాధర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఆర్ఎంఓ డాక్టర్ అబ్దుల్ రహీం తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed