సెక్షన్ 374-బీకు గవర్నర్ ఆమోదం.. ఇక హైడ్రా అఫీషియల్..!

by karthikeya |
సెక్షన్ 374-బీకు గవర్నర్ ఆమోదం.. ఇక హైడ్రా అఫీషియల్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేసి హైడ్రా వ్యవస్థకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టడానికి ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. గత నెల 20న నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కేబినెట్ కూడా డ్రాఫ్ట్ ఆర్డినెన్స్‌పై చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం దీనికి సంబంధించిన ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ ఆమోదం కోసం పది రోజులుగా పరిశీలనలో ఉన్న ఈ ఆర్డినెన్సుపై మంగళవారం సంతకం చేసినట్లు సమాచారం. కానీ.. ఈ విషయాన్ని అటు రాజ్‌భవన్ వర్గాలు గానీ, ఇటు ప్రభుత్వవర్గాలు గానీ ధ్రువీకరించలేదు. హైడ్రా కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు తొలుత అధికారులు భావించినా కేబినెట్‌లో చర్చ సందర్భంగా జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించి అందులో ఒక క్లాజ్‌ను చేర్చడం ద్వారా కొన్ని అధికారాలను అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్సు స్థానంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి చర్చించనున్నది.

చట్టంలోకి కొత్తగా సెక్షన్ 374-బీ..

ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడంతోపాటు చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్‌టీఎల్ (పుల్ ట్యాంక్ లెవల్), ఎంఎఫ్ఎల్ (మాగ్జిమమ్ ఫ్లడ్ లెవెల్), బఫర్ జోన్ తదితరాలను ఆక్రమించి కట్టడాలు చేపట్టకుండా రక్షించేందుకు హైడ్రాను వాడుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ చట్టంలోని ‘సెక్షన్ 374-బీ’ పేరుతో కొన్ని క్లాజులు చేర్చారు. ఆ అధికారాలను హైడ్రాకు అప్పగించడం ఆర్డినెన్సులోని కీలక అంశం అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. చట్టంలో సెక్షన్ 374-ఏ మాత్రమే ఉండగా ఇప్పుడు సవరణతో ‘బీ’ కూడా చేరనున్నది. హైడ్రా పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉండేలా ఆర్డినెన్సులో ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిపారు. ఆ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం అవసరమయ్యే పలురకాల అధికారాలను ఈ ఆర్డినెన్సు ద్వారా హైడ్రాకు అప్పగించేలా సవరణలకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే హైడ్రా అమలు కోసం ప్రభుత్వం జీవో (నెం. 99, జూలై 19, 2024)ను జారీచేసింది.

హైడ్రాకు అధికారాల అప్పగింత..

ఔటర్ రింగు రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్‌గా పరిగణిస్తున్నది. ఈ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను, నీటి తావులను రక్షించే బాధ్యతను హైడ్రాకు అప్పగించింది. అయితే.. చట్టపరంగా హైడ్రాకు కొన్ని ఆటంకాలు ఎదురవుతుండడంతో జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేసి విశేష అధికారాలు కల్పించేలా ఆర్డినెన్స్ ఆలోచన చేసింది. ఈ సవరణ ద్వారా సెక్షన్ ‘374-బీ’లో ఏదేని ఒక కార్పొరేషన్ లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, డ్రెయిన్లు, వీధులు, నీటి వనరులు, ఖాళీ స్థలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించడానికి అవసరమైన అధికారాలను బదిలీ చేసేలా పొందుపరిచారు. ఇలా బదలాయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా వివిధ విభాగాలకు చెందిన (జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, మునిసిపాలిటీ) అధికారాలను బదిలీ చేయడం ఆర్డినెన్సులోని కీలక అంశం.

స్వతంత్రంగా పనిచేసేలా..

ఔటర్ రింగు రోడ్డు వరకు చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురైతే వాటిని తొలగించేందుకు ప్రస్తుతం వేర్వేరు విభాగాలు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే కూల్చివేతల వ్యవహారాన్ని హైడ్రా చూసుకుంటున్నది. వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో, వాటి చట్టాల మేరకు హైడ్రా చర్యలు తీసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఆర్డినెన్సు ద్వారా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు ఉన్న అధికారాలన్నీ హైడ్రాకు సంక్రమించనున్నాయి. దీంతో నోటీసుల జారీ మొదలు వాటి ఎగ్జిక్యూషన్ వరకు హైడ్రా స్వతంత్రంగా చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. జీహెచ్ఎంసీ చట్ట సవరణతో అందులోని అధికారాలన్నీ హైడ్రాకు అప్పగించే వెసులుబాటు లభిస్తుంది. మున్సిపాలిటీల చట్టం (సెక్షన్ 72, 98, 188), జలమండలి చట్టంలోని సెక్షన్ 5-81, హెచ్ఎండీఏ చట్టంలోని సెక్షన్ 5, 16(1) తదితరాలన్నింటి ద్వారా హైడ్రాకు అధికారాలు లభిస్తాయి.

అధికారుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్..

భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో హైదరాబాద్ నగరానికి ఉన్న ముప్పును తప్పించడానికి ప్రభుత్వం హైడ్రా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. గతంలో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని అప్పటి ప్రభుత్వాలు (నిజాం కాలం మొదలు) తీసుకున్న విధాన నిర్ణయాలు, వాటి అమలు, వచ్చిన ఫలితాలు, అమలులోని వైఫల్యాలపై అధికారుల బృందం రాజ్‌‌భవన్‌లో గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించినట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఈ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందిన గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

బిల్లు ఆమోదంతో హైడ్రాకు చట్టబద్ధత

హైకోర్టు సైతం హైడ్రా చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా ఈ వ్యవస్థ సమాజ మేలు కోసమేనని వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ నిర్దిష్టమైన విధివిధానాలు, మార్గదర్శకాలు, గైడ్‌లైన్స్, చట్టబద్ధత.. ఇలాంటివేవీ లేకుండా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలను మాత్రమే తప్పుపట్టింది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఈ ఆర్డినెన్సుకు ఆమోదం తెలపడంతో త్వరలో జరగనున్న అసెంబ్లీ సెషన్‌లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందడంతో హైడ్రాకు చట్టబద్ధత లభించనున్నది. అయితే ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారన్న అంశంపై రాజ్‌భవన్, ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. త్వరలో దీనిపై క్లారిటీ రానున్నది.

Advertisement

Next Story