బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. రచ్చ లేపుతున్న ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్

by karthikeya |
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. రచ్చ లేపుతున్న ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నువ్వు దొంగ అంటే… లేదు నువ్వే దొంగ’ అనే సామెతగా మారింది ప్రస్తుతం రీజినల్ రింగు రోడ్డు కథ.. ఆ ప్రాజెక్టు షురూ కాకముందే.. అసలు చర్చ అంతా అలైన్ మెంట్ మీదనే సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అలైన్మెంట్ విషయంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి నెలకొంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆర్ఆర్ఆర్ సౌత్ పార్టు అలైన్ మెంట్ ఫైనల్ చేసిందని.. తాము ఏమీ మార్పులు చేయడం లేదని.. కేవలం ఫాలో అవుతున్నామని కాంగ్రెస్ సర్కారు చెబుతున్నది. అయితే, ముఖ్యమంత్రి, తన అనుచరులకు లబ్ధి చేకూరే విధంగా వికారాబాద్, పరిగి వద్ద ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్పులు చేపట్టినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే, ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కక ముందే తీవ్ర చర్చకి దారి తీస్తున్నదని, ఇక భూసేకరణ ప్రక్రియ ఇంకెంత రణ నినాద వాతావరణం సృష్టిస్తుందోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

హైదరాబాద్ అభివృద్ధిపై ఎంతో ప్రభావం చూపించే రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) సౌత్ పార్టు అలైన్ మెంటులో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయన్న వార్తలపై రాజకీయ వేడి మొదలైంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ప్రణాళిక ప్రకారం సౌత్ పార్టు రింగ్ రోడ్డు విస్తీర్ణం 189.25 కిలోమీటర్లుగా నిర్ధారించగా… రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కిలోమీటర్లకు పెరిగిందని చెబుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వాదిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు లేవనెత్తుతుండగా… వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఇస్తున్నది. అయితే, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి-తూప్రాన్-చౌటుప్పల్) 158.2 కిలోమీటర్లు కాగా… రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అలైన్ మెంట్ ప్రకారం 194 కిలోమీటర్ల వరకు పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్ మెంట్ రూపొందించిందని తెలిసింది. ఆ పెంపు రాజకీయ ప్రభావితమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సౌత్ పార్టు అలైన్ మెంట్ సర్వే పూర్తి..

సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సొంత జిల్లా వికారాబాద్ గుండా వెళ్లే విధంగా రీజినల్ రింగు రోడ్డు సౌత్ పార్టు అలైన్ మెంట్ రూపొందించగా అందుకు సంబంధించిన ఫీల్డ్ సర్వే కూడా పూర్తయినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 189.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారికి సంబంధించిన మ్యాప్ ను ఇప్పటికే సిద్ధం చేసి నివేదిక రూపొందించారు. ఈ నివేదికను తెలంగాణ ప్రభుత్వ ఆమోదానికి పంపించగా… ఓకే చేసినట్టు తెలిసింది. అయితే, ఈ అలైన్ మెంట్ పట్ల ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండటంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అయితే, దీన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తొందరలోనే ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తున్నది.

Next Story

Most Viewed