బీజేపీకి 400 సీట్లు వస్తాయనడం భక్వాస్ మాటలే: మాజీ CM కేసీఆర్

by Satheesh |
బీజేపీకి 400 సీట్లు వస్తాయనడం భక్వాస్ మాటలే: మాజీ CM కేసీఆర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశంలో మోడీ హవా నడుస్తుందని.. 400 సీట్లు వస్తాయని ప్రచారం అంతా భక్వాస్ మాటలేనని, ఆ పార్టీకి 200 సీట్లు కూడా రావని, దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తాయని దానిలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలంటే తెలంగాణలో 14 సీట్లను గెలిపించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించాలని కేసీఆర్ రోడ్ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అచ్చేదిన్ అంటూ ప్రచారం చేశారు, అచ్చేదిన్ రాలేదు కానీ ప్రజలు సచ్చేదిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని ప్రచారం చేశారని కానీ దేశాన్ని సత్యనాష్ చేశారన్నారు.

రాష్ట్రంలో జిల్లాకొక నవోదయ ఇవ్వాలని 159 లేఖలు రాసినా పట్టించుకోలేదని, దేశంలో 150 మెడికల్ కాలేజీలు పెట్టినా ఒక్క మెడికల్ కాలేజి ఇవ్వలేదన్నారు. బీజేపీ ఖతర్నాక్ పార్టీ అని దానితో జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణను గుజరాత్ మోడల్‌లా డెవలప్ చేస్తామంటే గోద్రా మోడల్ మారణహోమమా అని కేసీఆర్ ప్రశ్నించారు. మోడీ దేశంలో ఎక్కడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలేదని కానీ ఒక్క తెలంగాణలోనే బీడీ కార్మికులకు, టేకేదార్లకు పెన్షన్ ఇచ్చామని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల కన్నా బీఆర్ఎస్ ఆరు శాతం ఓట్లతో ముందున్నామని గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదని పొరపాటున కూడా ముస్లీం మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుందని అన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎత్తుకుని మద్దతు తెలిపిన జిల్లా నిజామాబాద్ జిల్లా అని గుర్తు చేశారు. తెలంగాణకు వచ్చే గోదావరి నీళ్లను మోడీ తమిళనాడుకు ఇద్దామని చూస్తున్నాడని, దానిని అడ్డుకోవాలంటే బాజిరెడ్డి గోవర్దన్‌ను గెలపించాలనన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు మొదలయ్యాయన్నారు. ఐదు నెలల పాలనలోనే స్కాలర్ షిప్‌లు, కేసీఆర్ కిట్‌లు ఆపివేశారని అన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. తులం బంగారం ఎక్కడ పోయిందని, ఎక్కడైనా ఇచ్చారా అని, రుణమాఫీ డిసెంబర్ 9న చేస్తామని ప్రకటించి రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. రైతులకు భరోసా ఇస్తామని రైతుబంధును బంద్ చేశారని మళ్లీ తాను రోడ్డెక్కడంతోనే నిన్న, ఇవాళ రైతుబంధు డబ్బు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారని అన్నారు. రోడ్ల మీద ఇప్పటికీ వడ్లు కొనుగోలు చేయక ఉన్న విషయాన్ని స్థానికంగా ప్రజాప్రతినిధులు తనకు చూపించారని, వడ్లకు మద్దతు ధర ఇవ్వడం లేదని బోనస్ సంగతి దేవుడెరుగు అన్నారు. బాసర పోయిన, యాదాద్రి పోయిన దేవుళ్ళ మీద ఓట్లు కేసీఆర్‌ను తిట్టు అన్న సామెతను కాంగ్రెస్ పాటిస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బంగారు జిల్లాగా తీర్చిదిద్దామని 60 ఏళ్ళలో కాంగ్రెస్, టీడీపీలు జిల్లాను నిండా ముంచాయన్నారు. తెలంగాణ వచ్చాక కాళేశ్వరం కట్టుకుందామని ఎండిపోయిన నిజాంసాగర్, వట్టిపోతున్న శ్రీరాంసాగర్‌లకు కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేస్తున్నామన్నారు.

కేసీఆర్ 30 వేల కోట్లు ఇచ్చాడు, మేము కూడా రెండు లక్షల రుణమాఫీ అయిందా బ్యాంకులో తీసుకున్నారా అని ప్రశ్నించారు. నేను హిందువునేనని కానీ తెలంగాణలో ఉన్న ప్రజలందరికి కేసీఆర్ ఆత్మబంధువు అని, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే హిందు, ముస్లీం అటూ మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. నేను మోడీ వ్యతిరేకిని కాబట్టే నా కూతురిని జైల్లో పెట్టారని, అయినా కేసీఆర్ భయపడేవాడు కాడని ఆరు నూరైనా నూరు ఆరైనా కేసీఆర్ లొంగిపోయేటోడు కాదన్నారు. ముఖ్యంగా యువకులు ఓటు వేసేటప్పుడు ఆలోచనతో, పరిణితితో ఓటు వేయాలని కోరారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ చెప్పానని, ఒకసారి చర్చించుకుని ఆలోచనతో పులి బిడ్డ బాజిరెడ్డి గోవర్దన్‌ను గెలిపిస్తే ఢిల్లీలో మన బలం చూపిస్తామని అన్నారు. ఈ రోడ్ షోలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్త, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, మేయర్ దండునీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed