కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య ఫ్లెక్సీ వార్

by Sridhar Babu |
కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య ఫ్లెక్సీ వార్
X

దిశ, భిక్కనూరు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ బర్త్ డే ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చించివేత చిలికి చిలికి గాలి వానలా మారి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళితే భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలోని ప్రధాన కూడలిలో షబ్బీర్ అలీ బర్త్ డే ను పురస్కరించుకొని భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే అదే రోజు గ్రామంలో పెళ్లి భరాత్ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు యువకులు తాగిన మైకంలో ఫ్లెక్సీలు చించి వేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అనుమానితులైన

నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే విచారణ అనంతరం అనుమానితులు స్టేషన్ ఆవరణలో ఉండగా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు తిరుపరి భీంరెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తుడుంజీవన్ లతోపాటు మరి కొంతమంది మండల నాయకులు స్టేషన్ కు చేరుకొని ఫ్లెక్సీలు చించేసింది నువ్వేనా అంటూ బీఆర్ఎస్ యువకులపై చేయి చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలియక బీఆర్ఎస్ నాయకుడు ఒకరు ఏదో పొరపాటు జరిగిందని, కేసు విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులను రిక్వెస్ట్ చేయడంతో చివరకు కాంప్రమైజ్ అయ్యారు.

కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన విషయాన్ని రాత్రి ఇంటికి వెళ్లాక చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన జరిగిన విషయాన్ని జిల్లా ఎస్పీ సింధు శర్మకు అదే రాత్రి ఫోన్ చేసి వివరించాడు. దీంతో ఎస్పీ సింధు శర్మ స్థానిక పోలీసులకు ఫోన్ చేసి దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో మొదట పోలీసులు నలుగురు నాయకులపై కేసు నమోదు చేశారు.

ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కొందరు అదే రాత్రి ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ దృష్టికి తీసుకుపోగా ఆయన కూడా ఎస్పీ సింధు శర్మకు ఫోన్ చేసి ఊరికే నిలబడ్డ వారిపై కాకుండా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వారిపైన మాత్రమే కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో భీంరెడ్డి రెడ్డి, తుడుం జీవన్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి శుక్రవారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

రౌడీ షీట్ ఓపెన్ చేయాలి

స్టేషన్ ఆవరణలో బీఆర్ఎస్ యువకులపై దాడికి దిగిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు భీంరెడ్డి పై రౌడీ షీట్​ ఓపెన్ చేయాలని కోరుతూ భిక్కనూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి, గ్రామ పట్టణాలలో ఉండే వారంతా పార్టీలకతీతంగా కలిసిమెలిసి ఉండాలని, ఆర్మీలో పని చేసిన అనుభవం ఉన్న

భీం రెడ్డి ఆదర్శంగా నిలుస్తాడని అనుకుంటే, అధికార దాహంతో రెచ్చిపోయి దాడులు చేయడం సంస్కారం కాదన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించలేదని, ఏదైనా సమస్య వస్తే సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకునేవాళ్లమని, కానీ ఈ విధంగా దాడులకు దిగలేదని గుర్తు చేశారు. ఇకనైనా భీంరెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఫ్లెక్సీ చించివేతలో నలుగురు పై కేసు నమోదు

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చించివేతలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. శుక్రవారం దిశ ఆయన్ని వివరణ కోరగా బస్వాపూర్ గ్రామానికి చెందిన సాయిలు, ప్రణీత్, భార్గవ్, ప్రమోద్ ల పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ లో ఉండగా వారిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు వివరించారు.

Advertisement

Next Story