రైతుల హామీలు నెరవేర్చే వరకు పోరుబాటే

by Sridhar Babu |   ( Updated:2024-04-06 14:04:52.0  )
రైతుల హామీలు నెరవేర్చే వరకు పోరుబాటే
X

దిశ, భీంగల్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల ధాన్యంకు మద్దతు ధర కలిపి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ దానిని వెంటనే అమలు చేయడంతో పాటు రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చెయ్యాలని, లేని పక్షంలో రైతు పోరుబాట తప్పదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం వేల్పూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పోరుబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ అమలు చేయకపోగా, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. మళ్లీ కాంగ్రెస్ నాయకుల, ముఖ్యమంత్రి మాటలు నమ్మి వారికి ఓటు వేస్తే కష్టాలు కొని తెచ్చికున్నట్లేనని అన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గత ఎన్నికల్లో సీఎం ఇచ్చిన ప్రతి హామీకి సంబంధించిన వీడియో, ఆడియోలను సభ వేదికగా వినిపించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరంను నిర్మించి ప్రపంచ మ్యాప్లో తెలంగాణను నిలబెడితే, మేడిగడ్డ కుంగిందని కేసీఆర్ ను బదునాం చేయాలని చూస్తున్నారన్నారు. 84 ఖానాల్లో 2 ఖానాలు కుంగితే మరమ్మతు చేయాల్సింది పోయి కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వ చేతకాని ప్రభుత్వంవారు రోడ్డు ఎక్కినా వాగులు నింపలేక పోయారని దుయ్యాబట్టారు. లక్ష్మి కెనాల్ కింద పంటలు ఎండిపోతున్నా నీళ్లు వదలడం లేదన్నారు. లక్ష్మి కెనాల్ కింద పంటలకు నీటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story