బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన

by Sumithra |
బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన
X

దిశ, లింగంపేట్ : లింగంపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదుట రైతులు ఆందోళన చేశారు. బ్యాంకులోని ఖాతాదారుల నుంచి డబ్బులు డ్రా చేసినట్లు బాధితులు ఆరోపించారు. పంట రుణాల కోసం బ్రోకర్లను ఆశ్రయించిన వారికి రుణాలు మంజూరు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. బ్యాంక్ అధికారులు తీరు పట్ల ఆందోళన చేసిన రైతులు బ్యాంకు తీయకుండా అడ్డుకొని బ్యాంక్ మేనేజర్ తో పాటు సిబ్బందిని ప్రశ్నించారు. పోల్కంపేట గ్రామానికి చెందిన తలారి కిష్టయ్య అనే వ్యక్తి గతంలో అనారోగ్యంతో మృతి చెందారు. కాగా గత మూడు రోజుల క్రితం కిష్టయ్య ఖాతా నుంచి 4900 ఇతరులు డ్రా చేశారు. అంతేకాకుండా తలారి కిష్టయ్యకు గత మార్చి మూడో తేదీన పంట రుణం బకాయి లేనట్టు ఎన్వోసీ ధ్రువీకరణ పత్రం బ్యాంక్ అధికారులు జారీ చేశారు. అదే రైతు ఖాతా నుండి అక్టోబర్ మాసంలో కిష్టయ్య వ్యవసాయ రుణం ఉన్నట్టు 26,970 రూపాయలను ఖాతాలో జమ చేశారు.

ఎన్ఓసి ఇచ్చిన అధికారులు తిరిగి వ్యవసాయ రుణం వసూలు చేయడం పై కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులకు రుణమాఫీ వర్తించినప్పటికీ వారికి జమ చేయకుండా నిర్లక్ష్యం వహించినట్లు రైతులు ఆరోపించారు. నూతన వ్యవసాయ రుణాల కోసం బ్యాంకు చుట్టూ నెలల తరబడి తిరిగినా రుణాలు ఇవ్వడం లేదన్నారు. బ్రోకర్లను ఆశ్రయించిన వారికి ఒక్కరోజులోనే రుణాలు మంజూరు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. బ్యాంక్ మేనేజర్ అర్యరాజ్ తో పాటు సిబ్బందిని రైతులు నిలదీశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బ్యాంక్ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో బ్యాంకు తెరవకుండా అడ్డుకున్నారు. ఈ విషయాన్ని రైతులు ఆర్డీవో ప్రభాకర్ కు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్సై ప్రభాకర్ బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. బాధిత రైతులు ఫిర్యాదులు తీసుకుని విచారణ చేపట్టి బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. బ్యాంక్ అధికారుల తీరుపై రైతులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ తో పాటు లీడ్ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆందోళన కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed