డబుల్‌ ఆనందం..! నిరుపేదల సొంతింటి కల సాకారం

by Shiva |
డబుల్‌ ఆనందం..! నిరుపేదల సొంతింటి కల సాకారం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గత ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని పంపిణీ జరగకుండా ఆగిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని దాదాపు ఏడేళ్లుగా పంపిణీకి నోచుకోకుండా ఉన్న డబుల్ ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు, కిటికీలు, శానిటరీ వస్తువులు ఎత్తుకెళ్లారు. పూర్తి స్థాయిలో ఓ మోడల్ కాలనీలో నిర్మించిన ఇళ్ల కాలనీ ప్రస్తుతం దారుణంగా తయారైంది.

ప్రస్తుతం ఆ ఇళ్లను పంపిణీకి యోగ్యంగా తయారు చేయాలంటే అవసరమైన మరమ్మతులు చేస్తే తప్ప పేదలకు ఆ ఇళ్లను పంపిణీ చేయలేని పరిస్థితి. కొద్దిరోజుల క్రితం మంత్రి పొంగులేటి జిల్లాలో అధికారుల రివ్యూ సమావేశంలో పాల్గొన్నప్పుడు డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేస్తామని, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాజాగా, డబుల్ బెడ్ రూం పనుల కోసం ప్రభుత్వం నుంచి రూ.1.25 కోట్లు మంజూరైనట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు. వాటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లుగా సమాచారం.

జిల్లాలో 15,304 ఇళ్లు మంజూరు

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 15,304 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 7,080 ఇళ్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో 2,580 మంజూరు కాగా, 1,176 ఇళ్లను మాత్రమే పూర్తయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో 2,130 ఇళ్లు మంజూరు కాగా, కేవలం 336 మాత్రమే పూర్తయ్యాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,564 ఇళ్లు మంజూరయ్యాయి. 156 మాత్రమే పూర్తయ్యాయి. నిజామాబాద్ అర్బన్‌లో 2,330 ఇళ్లు మంజూరు కాగా, 900 ఇళ్ల నిర్మాణం పనులు మొదలయ్యాయి. కానీ, పూర్తి స్థాయిలో నిర్మాణ పూర్తి చేసుకున్న ఇళ్ల సంఖ్య 396 మాత్రమే. బోధన్ నియోజకవర్గంలో 1,712 ఇళ్లు మంజూరు కాగా, 1,137 పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లా పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గంలో 4,988 మంజూరు కాగా, 3879 ఇళ్ల నిర్మాణం పనులు పూర్తయ్యాయి.

ఆశగా చూస్తున్న నగరవాసులు..

నిజామాబాద్ నగరంలో వేల మంది పేద కుటుంబాలు డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదిరుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం తమకు ఇళ్లు కేటాయిస్తుందా? ఎప్పుడెప్పుడు పాలు పొంగించుకుని గృహ ప్రవేశం చేసి పాలు పొంగించుకోవాలా.. అని ఆశగా చూస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి ఇటీవల డబుల్ బెడ్ రూం పంపిణీ విషయంలో స్పష్టతనివ్వడంతో నగర ప్రజల్లో మరోసారి ఆశలు రేకెత్తాయి.

నిజామాబాద్ నగరశివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇటీవల ఇంజనీరింగ్ విభాగం అధికారులు పరిశీలించి, మరమ్మతులకు అవసరమైన నిధుల అంచనాలు వేసినట్లుగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీకి యోగ్యంగా తయారు చేసి పంపిణీ చేయాలనే ఆలోచనతో అధికారులు ముందుకెళుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో సంబంధిత అధికారులను సంప్రదించి సమాచారం అడిగితే సరైనా సమాధానం చెప్పడం లేదు. చెపుతున్నారు, తప్పు పూర్తి వివరాలు చెప్పడం లేదు. కానీ, అంతర్గతంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story