- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందూరుకు నిరాశే.. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి ఉత్తి మాటే
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిజామాబాద్ జిల్లాకు నిరాశే మిగిలింది. జిల్లా ప్రజలు ఎప్పటిలాగే బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకున్నప్పటికీ, వారి ఆశల మీద భట్టి గట్టిగా నీళ్లు చల్లారు. జిల్లాలో తెలంగాణ పేరుతో ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ ప్రతిసారి నిధుల కోసం ఎదురుచూడడం నిరాశకు గురికావడం మామూలైంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత, సిబ్బంది కొరతతో పాటు, అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఇతర సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వం నుంచి నిధుల విడుదల కోసం ఎన్నోసార్లు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. ధర్నాలు చేసి నిరసనలు తెలిపాయి. వీరితో పాటుమేధావులు, విద్యావంతులు కూడా యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రతిసారి నిధుల కోసం ప్రతిపాదనలు పెట్టడం ఆనవాయితీగా మారింది.
ఉమ్మడి జిల్లా నుండి ఆరుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ( ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలుపుకొని) ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం సాధించలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు కలుపుకొని బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించింది. దీనిలో ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 100 కోట్లు, మహిళ యూనివర్సిటీకి రూ.100కోట్లు ఫోను రూ.300కోట్లు రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు పంచుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ యూనివర్సిటీకి రూ.200కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో దక్కింది మాత్రం ప్రసాదం మాత్రమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులు యూనివర్సిటీ సిబ్బంది జీతాలకైనా సరిపోతాయో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోపక్క ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరున్న ఎన్డీఎస్ఎఫ్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారే తప్ప, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఎంత మేర నిధులు కేటాయించారన్నది, ఎలా ముందుకెళుతున్నామనే విషయంలో స్పష్టత లేదు. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ ఎనిమిది నెలలు దాటిన ఇప్పటివరకు జిల్లా ప్రజలకు, ఫ్యాక్టరీపై ఆధారపడ్డ రైతు కుటుంబాలు, ఫ్యాక్టరీ కార్మిక కుటుంబాలకు స్పష్టమైన భరోసాను ఈ ప్రభుత్వం కల్పించలేక పోతోంది.
ఒకింత ఊరట..
ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నియోజకవర్గానికి 3,500 లు చొప్పున ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టంగా చెప్పడం సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద ప్రజలకు ఊరట కలిగించిందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు కలిపి 31,500 కుటుంబాలకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఇరిగేషన్, వ్యవసాయ రంగం, విద్య, వైద్యం వంటి రంగాల్లో కూడా ఉమ్మడి జిల్లాకు నిరాశ మిగిలిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.