Dirty Water : సమస్యల వసతి గృహం..

by Sumithra |
Dirty Water : సమస్యల వసతి గృహం..
X

దిశ, పిట్లం : బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాయి. అందుకు నిదర్శనమే పిట్లం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం. పిట్లం మండలంలోని సాయినగర్ కాలనీలో అద్దె భవనంలో కొనసాగుతున్న వసతి గృహంలో బాలికలు 600 పై చిలుకే ఉన్నారు. ఏర్పాటు చేసిన వసతి గృహంలో మురికి కాలువలు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మురికి నీరు మొత్తం వసతిగృహం చుట్టూ చేరుతుండడంతో దుర్వాసన వెదజల్తున్నాయి. మురికి కాలువల ఏర్పాటు వసతి గృహ యజమానులు నిర్వహించ లేక, గ్రామపంచాయతీ నిర్వహించాల్సి ఉందా అన్న సందిగ్ధత ఏర్పడుతుంది. అసలు విషయానికొస్తే ఈ కాలనీలో ఏర్పాటుచేసిన వెంచర్ డీటీసీపీ అప్రూవల్ లేకుండానే ఏర్పాటు చేశారు.

డీటీసీపీ లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లకు గ్రామపంచాయతీ నుండి గృహ నిర్వహణ అనుమతులు ఇవ్వకూడదు. అలా కాకుండా అనుమతులు ఇవ్వడంతో వెంచర్లో మురికి కాలువలు లేకుండానే భవనాలు నిర్మించారు. నిర్మించిన అనంతరం మురికి కాలువల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కాలనీలో కొనుగోలు చేస్తున్న ప్లాట్లల్లో నిర్మించిన భవనాలకు ఏ ఒక్కదానికి కూడా మురికి కాలువ లేకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉంటే వసతి గృహ నిర్వాహకులు అనేకమార్లు 14 లక్షల నిధులతో గ్రామపంచాయతీ తీర్మానం చేయించి ముందున్న కలెక్టర్ జితేష్ వి పటేల్ కు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఎన్ని పర్యాయాలు వినతిని సమర్పించిన పట్టించుకోలేదన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న తరుణంలో దుర్గంధం మురికితో విద్యార్థులు అవస్థలకు గురయ్యే అవకాశం ఉందని పాఠశాల ప్రిన్సిపల్ గులాం రబ్బాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చిన నూతన కలెక్టర్ ఆశిష్ సంఘవ్వాన్ తమ సమస్యలు పరిష్కరించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed