కోర్టులో డీసీసీబీ అవిశ్వాస బంతి

by Sridhar Babu |
కోర్టులో డీసీసీబీ అవిశ్వాస బంతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 5న డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీవోకు అందజేసిన విషయం తెల్సిందే. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్లు నోటీసులు అందజేసి క్యాంపు కు తరలిన విషయం తెల్సిందే. మొదట డీసీసీబీ చైర్మన్ పదవిని వదులుకునేందుకు సిద్దమైన పోచారం భాస్కర్ రెడ్డి ఎంపీగా అవకాశం దక్కకపోవడంతో తన పదవిని కాపాడుకునేందుకు కోర్టు గడుపను తొక్కారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిన వెంటనే డీసీసీబీ డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి డైరెక్టర్లకు చైర్మన్ మధ్య ఉన్న విభేదాలు ఉప్పునిప్పులా ఉన్నాయి.

ఏకంగా ప్రభుత్వం పడిపోవడం జిల్లాలో బీఆర్ఎస్ రెండు స్థానాలకు పరిమితం కావడంతో చైర్మన్ పై వ్యతిరేకంగా ఉన్న డైరెక్టర్లు కాంగ్రెస్ లో చేరి ఆయనపై అవిశ్వాస తీర్మానానికి సిద్దమయ్యారు. ఈ మేరకు ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ భాస్కర్‌ రెడ్డిపై ఆవిశ్వాసానికి నోటీసులు ఇవ్వగా జిల్లా కలెక్టర్‌ లేదా సంబంధిత శాఖ కమిషనర్‌ నోటీసులు ఇవ్వాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జిల్లా కో ఆపరేటివ్‌ అధికారి (డిసిపి) శ్రీనివాస్‌ నోటీసులు ఇచ్చారు. దీనిపైనే అధికారులు చర్యలు చేపట్టారు. డీసీసీబీలో సాధారణ అధికారిక సభ్యుడు అయిన డీసీఓకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని కోర్టులో డీసీసీబీ చైర్మన్‌ సవాల్‌ చేశారు. అయితే ఈ తంతు అంతా కావాలనే ఉద్దేశ్య పూర్వకంగానే చేశారనే విమర్శలు సైతం ఉన్నాయి. దీనిపై కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందోనని, తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలనే ఆంశంపై అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు.

ఎలాగు ఈనెల 21న తేదీన సమావేశం ఉండటంతో డైరెక్టర్లు సైతం 15 మందికి పైగా పది రోజుల క్రితమే క్యాంపునకు వెళ్లారు. మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాసానికి మద్దతుగా నిలవడంతో ఎట్టి పరిస్థితుల్లో ఆవిశ్వాసం నెగ్గుతుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ అనుహ్యంగా చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అయితే దీనిపై ఆవిశ్వాసానికి నోటీసులు ఇచ్చిన డైరెక్టర్లు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి వస్తుంది. మంగళవారం హైకోర్టులో ప్రభుత్వం తరపున, పోచారం భాస్కర్ రెడ్డి తరపున ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. గురువారం అవిశ్వాసంపై ఓటింగ్ జరుగనుండడంతో బుధవారం లేదా తర్వాత ఎప్పుడైనా సంబంధిత తీర్పును వెలువరించే అవకాశం ఉంది. అయితే డైరెక్టర్లు మాత్రం చైర్మన్ వాదనలను కోర్టు స్వీకరించలేదని అందుకే అవిశ్వాస తీర్మానంపై స్టే ఇవ్వలేదని తెలిపారు.

బుధవారం ఈ విషయంలో కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డ గద్దె దించడం వెనుక కాంగ్రెస్ నేతలు ఐక్యంగా పని చేస్తున్నారని చెప్పాలి. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న డైరెక్టర్లు కాంగ్రెస్ వైపు మరలడంతో చైర్మన్ ను గద్దె దించేందుకు మాజీ సీనియర్ ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనకు మాజీ మంత్రి తోడవ్వడంతో చకచకా కార్యకలాపాలు ముందుకు సాగుతున్నాయి. మాజీ మంత్రికి సమీప బంధువు అయిన డీసీసీబీ వైస్ చైర్మన్ ను గద్దె నెక్కించాలని మంత్రాంగం కొనసాగుతుంది. ఇటీవల

ఆర్మూర్ బల్ధియా చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చైర్ పర్సన్ పండిత్ వినీత కోర్టును ఆశ్రయించి దాదాపు నెల రోజులకు పైగా పీఠంను వీడలేదు. అదే తోవలో పోచారం భాస్కర్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కిన కేసీఆర్ గవర్నమెంట్ తీసుకువచ్చిన సహకార చట్టంలోని మార్పులే ఆయనకు గుదిబండలా మారాయని చెబుతున్నారు. పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామాకు ఇష్టపడక అవిశ్వాసం నెగ్గితే పదవిని వీడే యోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. గోవా క్యాంప్ కు వెళ్లిన డైరెక్టర్లు బుధవారం నిజామాబాద్ కు చేరుకోనున్నారు. ఈ నెల 21న జరిగే అవిశ్వాస తీర్మానంకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed