ఎవర్రా మీరంతా మరీ ఇంత టాలెంటెడ్ ఉన్నారు ఇలా కూడా మోసం చేస్తారు..?

by Naveena |   ( Updated:2024-10-07 14:25:01.0  )
ఎవర్రా మీరంతా మరీ ఇంత టాలెంటెడ్ ఉన్నారు  ఇలా కూడా మోసం చేస్తారు..?
X

నకిలీ బ్యాంక్ అధికారులుగా చెలామణి అవుతూ, అమాయక రైతులను, వ్యాపారస్తులను మభ్యపెడుతూ తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇప్పిస్తామని రూ. 25 లక్షల కొల్లగొట్టిన మోసగాళ్లను అరెస్టు చేసినట్లుగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వెల్లడించారు. 7గురు నిందితులు మొత్తం 28 మంది రైతులను, వ్యాపారస్తులను మోసగించి మొత్తం రూ. 25 లక్షల 7 వేలు వసూలు చేశారని తెలిపారు. వారి నుంచి ప్రస్తుతానికి రూ. 1లక్షా 25వేల రూపాయలతో పాటు రైతుల నుంచి వారు తీసుకున్న పట్టాదారు పాసుపుస్తకాలు, అగ్రిమెంట్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నిందితులు వసూలు చేసుకున్న మిగతా నగదును కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకొని రికవరీ చేయడం జరుగుతుందని చెప్పారు. నిందితులు కట్టేబోయిన పరమేష్, మమ్ముల జ్యోతి స్వరూప్, కొండా శ్రీను, గోగుల సురేశ్, చిలుముల సైదులు, పల్లెబోయిన నాగరాజు, ముప్పిడి సైదులలను అరెస్టు చేయగా, షేక్ వజీర్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు.నిందితులు ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో గత కొంత కాలంగా వివిధ బ్యాంకులలో పనిచేస్తున్న అధికారులుగా నటిస్తూ వస్తున్నారని ఎస్పీ తెలిపారు.

నకిలీ బ్యాంక్ అధికారులుగా చెలామణి అవుతూ రైతులకు వద్దకు వెళ్లి వారి యొక్క భూములను తనఖాగా పెట్టుకొని తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంక్ నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని రైతులను మోసగిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలోని పెద్దవూర, తిరుమలగిరి (ఎస్), నిడమానూర్, నేరేడుగొమ్ము, దేవరకొండ, పిఏ పల్లి మండలాలలోని అమాయక రైతుల నుంచి రుణాలు ఇచ్చేందుకు ముందుగా రైతుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకొన్నారని ఎస్పీ వివరించారు. హాలియా మండలంలోని ఒక వ్యాపారికి సోషల్ వెల్ఫర్ నుంచి అధిక మొత్తంలో లోన్ ఇప్పిస్తామని నమ్మించి ఇప్పించకుండా మోసం చేస్తున్న నిందితులను పెద్దవూర పోలీసులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నగదుని కోర్ట్ అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed