అమిత్ షా దృష్టికి ఐదు పంచాయతీల సమస్య

by Aamani |
అమిత్ షా దృష్టికి ఐదు పంచాయతీల సమస్య
X

దిశ, భద్రాచలం : కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ లో భాగంగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షా ను ప్రత్యేకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టం లోని పెండింగ్ అంశాలను చర్చిస్తూ, పోలవరం ముంపు పేరుతో ఆంధ్ర లో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణాలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.గతంలో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని కూడా అమిత్ షా కు తెలిపి ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరినట్లు తెలిసింది.

రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో 7 మండలాలను ఆంధ్రాలో విలీనం చేశారు. దీనిలో భాగంగా భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఎటపాక, పురుషోత్తమపట్నం, గుండాల, పిచ్చుకుల పాడు, కన్నాయిగూడెం పంచాయతీలు ఆంధ్రాలో కలిశాయి. దీనివల్ల భద్రాచలం అభివృద్ధికి సెంటు స్థలం లేకుండా పోయింది. భద్రాచలం పట్టణంలోని కొన్ని కాలనీలు ఆంధ్రాలో సగం, తెలంగాణా లో సగం ఉండిపోయాయు. దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రాలో విలీనం అయిన పై ఐదు పంచాయతీలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం వలన పాలన ఆంధ్ర ప్రభుత్వానికి కష్టంగా మారింది.అక్కడ ప్రజలు కూడా తెలంగాణాలోనే ఉండాలని కోరుకుంటున్నారు.ఐదు పంచాయతీలను తెలంగాణాలో విలీనం చేయాలని గత 10 సంవత్సరాలుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాష్ట్ర విభజన నాటి పెండింగ్ సమస్యలు గురించి ఏర్పాటు చేసిన ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల భేటీ లో కూడా ఐదు పంచాయతీల విషయం ప్రధానంగా చర్చించారు. ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణాలో కలిపేందుకు ఆంధ్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.అయితే ఐదు పంచాయతీలను తెలంగాణాలో కలవడం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండడంతో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలవడం పై ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed