కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలి

by Sridhar Babu |   ( Updated:2024-03-12 09:09:46.0  )
కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలి
X

దిశ, కామారెడ్డి : ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటూ కనీసం వారిపట్ల మానవ దృక్పథంతో ఆలోచించని గత ప్రభుత్వాలకు ఉద్యోగుల ఉసురు తగిలిందని, ఈ ప్రభుత్వమైనా తమను గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని విద్యాశాఖ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి దశాబ్దాలు మారినా తమ తలరాత మారలేదని వాపోయారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ విద్యారంగంలో నిరంతరం సేవలందిస్తూ తమ కుటుంబాలు ఆర్థిక భారంతో సతమతమవుతున్నా, తమ పిల్లలకు సరైన విద్యను అందించక, కుటుంబం

అనారోగ్య పాలవుతున్నా ఉద్యోగరీత్యా ఒత్తిడిలో చనిపోయిన ఉద్యోగులు చాలా మంది ఉన్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో జిల్లా, మండల స్థాయి పాఠశాలల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తూ పేద విద్యార్థులకు విద్యను చేరవేస్తూ ప్రభుత్వ పథకాలైన మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, రాగి జావ, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, విద్యార్థులకు కళానైపుణ్యం, వ్యాయామ విద్యను అందించడం, ప్రశ్నపత్రాల పంపిణీ, పరీక్షల నిర్వహణ, మన ఊరు మనబడి పాఠశాల నిర్వహణ, ఎస్ఎంసీ ట్రైనింగ్, ఏకో ఉపాధ్యాయ పాఠశాల నిర్వహణ, హరితహారం, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడం, బాలికల విద్య కోసం కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఇలా అనేక రకాలైనటువంటి సేవలందిస్తున్న తమకు న్యాయం చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేడుకున్నామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులం 25 రోజుల పాటు సమ్మె చేసిన కాలంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారని మాట ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికి కూడా తమ సమస్య అలాగే ఉందని వాపోయారు. హన్మకొండలో జరిగిన సమ్మెకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మాట ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, అప్పటివరకు తక్షణమే పేస్కేలు అమలు చేసి ఉద్యోగ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సమగ్ర శిక్ష విద్యాశాఖ ఉద్యోగ సంఘం పరిధిలో కేజీవీబీ, యూఆర్ఎస్, సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఈఆర్పీ మెసెంజర్లు, పీటీఐలు ఉన్నారని పేర్కొన్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సమ్మె సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు.

Advertisement

Next Story