కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఇందూరు ఓటర్లు తిప్పి కొట్టారు: ఎంపీ అర్వింద్

by Mahesh |
కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఇందూరు ఓటర్లు తిప్పి కొట్టారు: ఎంపీ అర్వింద్
X

దిశ, నిజామాబాద్ సిటీ: ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చేసిన కుట్రలను తిప్పి కొట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ మీద, నా మీద నమ్మకంతో నన్ను మరోసారి గెలిపించిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా మరోసారి తనను ఆదరించిన నియోజకవర్గం రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర, మత రాజకీయాలు చేశారని, అయినా ప్రజలు తమ వైపే నిలిచారన్నారు. నా గెలుపుతో పసుపు రైతుల కల నెరవేరిందన్నారు. తప్పకుండా వారికి అండగా ఉంటానన్నారు. పసుపు బోర్డు తేవడం ద్వారా గ్రామాల్లో పసుపు రైతులు తనకు మద్దతిచ్చారన్నారు. ఎంత కష్టమైనాప్పటికీ తాను ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతానని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పారు.

బోధన్ ఎమ్మెల్యే పై నిప్పులు చెరిగిన అరవింద్

బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ ఎన్నికల్లో చిల్లర రాజకీయాలు చేశారనీ, సుదర్శన్ రెడ్డి తన వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలన్నారు. ఆయన ఒక రాజకీయ అవకాశ వాది అని మండిపడ్డారు. లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపారం చేసే సుదర్శన్ రెడ్డికి షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని సోయి లేదా అని ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డితో జిల్లా ప్రజలకు, బోధన్ నియోజకవర్గ ప్రజలకు నయా పైసా ఉపయోగం లేదన్నారు. స్వార్థానికి మరో పేరు సుదర్శన్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గా చలామణి అవుతున్న ఆయన ఆటలు ఇక సాగవని అన్నారు. తన మాట వినని అధికారులను, ప్రజలను బెదిరించటం ఇప్పటికైనా మానుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో డబ్బులు పంచినా ప్రజలు తిరస్కరించారన్నారు. క్రీడాకారులకు కనీసం మైదానం కూడా ఏర్పాటు చేయని సన్యాసి ఆయన అని అన్నారు. ప్రజా సమస్యలు ఇబ్బందులు మరిచి తన వ్యాపారాలు మాత్రం బాగా పెంచుకున్నారని ఆరోపించారు. ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీకి భారంగా మారారనీ విమర్శించారు. ఇందూరు జిల్లాను ఇండస్ట్రియల్ జిల్లాగా మార్చేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు సహకరించాలన్నారు. జిల్లాలో టూరిజం పెంపొందించేందుకు కలిసి పని చేద్దాం అని సూచించారు.

ఇకపై తాను పార్లమెంటు ప్రజలు గర్వ పడేలా పని చేస్తా అని అన్నారు. రాష్ట్రంలో బీఅరెస్ అధికారం కోల్పోవటానికి కారణం బీజేపీయేనని పేర్కొన్నారు. మైనార్టీలకు వంత పాడిన బీఅరెస్ నేతలు ఇప్పుడు ఆలోచించాలన్నారు. మైనార్టీ జపం చేసిన కేసీఆర్‌ను కాదని ముస్లింలు కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళతానన్నారు. కవిత తప్పు చేసి, జైలుకు వెల్లిందనీ, తప్పు చేసినట్లు రుజువైతే రేవంత్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి పటేల్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త, పార్టీ సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డి, కార్పొరేటర్లు పంచ రెడ్డి ప్రవళిక, మల్లేష్ యాదవ్, ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed