ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ

by Sridhar Babu |
ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
X

దిశ, నిజామాబాద్ సిటీ : పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఈ మేరకు కౌంటింగ్ కోసం చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఇతర సహాయ రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతో పాటు నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కూడా సీఎంసీలోనే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను, ఆయా సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు గదులు, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు,

వసతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిశితంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భద్రతాపరమైన అంశాలను పరిశీలిస్తూ, ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, ఇతర సదుపాయాలకు సంబంధించి కొనసాగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, అభ్యర్థులు,

ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని చోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పని చేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని ట్రాన్స్కో ఏడీఈ రాజశేఖర్ ను ఆదేశిస్తూ, ప్రత్యామ్నాయంగా జెనరేటర్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా అన్ని స్ట్రాంగ్ రూంలలో ఫైర్ అలారమ్ లను తప్పనిసరిగా అమర్చాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మురళి మనోహర్ రెడ్డిని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంతో పాటు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఆర్డీఓలు రాజాగౌడ్, రమేష్ రాథోడ్, కార్మిక శాఖ అధికారి యోహాన్, విజయేందర్ రెడ్డి, మెప్మా పీడీ రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story