గాల్ రెడ్డి పదవికి ఎసరు పెడుతున్నారా..? గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే గంప

by Aamani |
గాల్ రెడ్డి పదవికి ఎసరు పెడుతున్నారా..? గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే గంప
X

దిశ,భిక్కనూరు : ఎంపీపీ అధ్యక్ష పదవి నుంచి జాంగిరి గాల్ రెడ్డిని, తప్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన నాయకులు ఆదివారం రాత్రి రహస్య ప్రాంతంలో సమావేశమై అవిశ్వాసానికి సంబంధించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన భిక్కనూరు ఎంపీపీ అధ్యక్షుడు జాంగిరి గాల్ రెడ్డి నాలుగు నెలల క్రితం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఊహించని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో, నాయకుల మధ్య గ్యాప్ ఏర్పడింది. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు గాను, 11 మంది ఎంపీటీసీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండగా, ఎంపీపీ తో కలిసి ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. అయితే జాంగిరి గాల్ రెడ్డి పై అప్పట్లోనే అవిశ్వాసం పెట్టాలని ఆలోచన వచ్చినప్పటికీ ఎంపీటీసీల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు.

నిన్న జరిగిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంతో మంచి ఊపులోకి వచ్చిన నాయకులు, సమావేశం అనంతరం పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులంతా కలిసి అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దృష్టికి తీసుకురాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రత్యేకంగా రహస్య ప్రాంతంలో సమావేశమై చర్చించుకున్నారు. ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఇటీవలే బీజేపీలో చేరినప్పటికీ, ఆమె కూడా అవిశ్వాసానికి మద్దతిస్తానని చెప్పినట్లు సమాచారం. వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి ని ఎంపీపీ అధ్యక్షునిగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయనతో ఏకాభిప్రాయం కుదుర్చుకొని రెండు మూడు రోజుల్లో అవిశ్వాసానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి నోటీసు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అధ్యక్ష పదవికి రెండు మూడు నెలల కాల పరిమితి మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ,ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం పెట్టి గద్దెదించాలన్న పట్టుదలతో రహస్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story