ఆర్మూర్‌లో కమల వికాసం.. భారీ మెజారిటీతో గెలుపు

by Mahesh |   ( Updated:2023-12-04 02:27:56.0  )
ఆర్మూర్‌లో కమల వికాసం.. భారీ మెజారిటీతో గెలుపు
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ రంగం తో పాటు, రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఆదివారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్మూర్ నియోజకవర్గంలోని ఓటర్లు బీజేపీకి పట్టం కట్టడంతో కమల వికాసం చేసింది. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డికి 71651 ఓట్లు రాగా విజయ డంకా మోగించారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి 42349 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా, అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పియుసి చైర్మన్, టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి 39051 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు.

మొదట ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ మండలంలోని కోమన్ పల్లి, తదితర గ్రామాల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు బీజేపీకి అనుకూలంగా ప్రారంభమై, ఆర్మూర్ మున్సిపల్ తో పాటు అన్ని మండలాల్లో బిజెపి జోరును కొనసాగిస్తూ చివరకు 16 రౌండ్ల ముగిసిన తర్వాత సుమారు 30 వేల మెజారిటీతో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయ బావుటా ఎగరవేశారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తొలి ప్రయత్నంలోనే సుమారు 30 వేల పైచిలుకు మెజారిటీని పైడి రాకేష్ రెడ్డి సాధించడం పట్ల ఆర్మూర్ లోని పలువురు రాజకీయ విశ్లేషకుల ప్రశంసలను ఆయన అందుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసిన పైడి రాకేష్ రెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు..

రాజరిక పాలన అంతమొందించి..

ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు మొదట పైడి రాకేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో యువరాజు, హరీష్ రావులతో కలిసి ప్రజాస్వామ్యాన్ని అంతం చేసి,రాచరిక పాలన ను చేశారని, ఆర్మూర్ ప్రజలు ఆ రాచరిక పాలన ను, ఆ పాలకుడు జీవన్ రెడ్డిని తరిమి కొట్టి, ధర్మ పాలనకు తీర్పునిచ్చారని రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ ప్రజలు ఎంతో విజ్ఞతతో బెదిరింపు రాజకీయాలను తరిమికొట్టి ధర్మ పాలనకు తీర్పు ఇచ్చారన్నారు. త్వరలో ఏర్పాటయ్యి తెలంగాణ నూతన సీఎంను కలిసి ఆర్మూర్లో ఇదివరకు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి చేసిన హత్య, అత్యాచార, దౌర్జన్యాలు, అరాచకాలపై ప్రత్యేక కమిషన్ వేయించి విచారణ చేయించాలని కోరతామన్నారు. ఆర్మూర్ లో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన వ్యక్తికి తప్పకుండా శిక్ష వేయించి, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తీహార్ జైలుకు పంపించే వరకు ఊరుకునేది లేదన్నారు. త్వరలోనే తెలంగాణ నూతన సీఎంను తప్పకుండా కలిసి ఆర్మూర్ లో జరిగిన అరాచకాలపై వివరించి విచారణ చేయిస్తానన్నారు.

లోకల్.. నాన్ లోకల్ అంశం

ఆర్మూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ప్రజల్లో లోకల్.. నాన్ లోకల్ అనే అంశం తీవ్ర చర్చ జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గత పది సంవత్సరాలుగా ఆశన్న గారి జీవన్ రెడ్డి పదవిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఆశన్న గారి జీవన్ రెడ్డి అప్పటి టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇంతకు ముందు సైతం ఆర్మూర్ నియోజకవర్గానికి లోకల్ వ్యక్తులు కానీ ఏలేటి మహిపాల్ రెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, బాజీరెడ్డి గోవర్ధన్ లు ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ప్రజల్లో రాజకీయ చైతన్యం అంతగా లేని సమయంలో, అటు తర్వాత ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా జీవన్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అనే అంశం తీవ్రంగా ప్రజల్లోకి వెళ్లేలా పోటీ చేసిన ప్రతిపక్ష పార్టీలైన అభ్యర్థులు పైడి రాకేష్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డిలు విస్తృతంగా ప్రచారం చేశారు.

గతంలో లోకల్.. నాన్ లోకల్ అనే అంశాలకు సంబంధం లేకుండా ఆర్మూర్ అసెంబ్లీ కి ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ఆర్మూర్ ప్రజలు ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా స్థానికుల్ని ఎన్నుకోవాలని నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తుంది. దీంతోపాటు ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం లో ఆర్మూర్ మున్సిపల్ లో విలీన గ్రామాలకు భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టిన, నూతనంగా ఆలూరు డొంకేశ్వర్ మండలాలను ఏర్పాటు చేయించిన అంశాలు పెద్దగా ఓట్లను వేయించ లేకపోయాయని ఫలితాల వెల్లడితో తేటతెల్లమైంది.

తరచు జీవన్ రెడ్డి ఆర్మూర్ కు ప్రాతినిధ్యం వహించిన హేమాహేమీలు చేయలేని అభివృద్ధి పనులను తను ఈ పదేళ్ల కాలంలో చేయించినట్లు ప్రచారం చేసిన ఈ అభివృద్ధి పెద్దగా ఓట్లు వేయించినట్లు కనబడలేదు. దీంతో పాటు ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచార పర్వం తో పాటు భారీ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు గుబులు పుట్టించేలా రెండు నెలల ముందు నుంచే జోరుగా ప్రచార పర్వాన్ని ప్రారంభించిన ఆలోచనలు పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేదని అవగతం అవుతుంది.

దీంతో పాటు చివరి రెండు రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ కు అవసరమయ్యే విషయాల్లో అధికార పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కొద్దిగా వెనుకంజ వేసినట్లు ఆర్మూర్ లోని జనం తీవ్రంగా చర్చించు కున్నట్లు తెలిసింది. పైగా బిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఆయన ప్రధాన అనుచరులు నియోజకవర్గంలో ఎదురు తిరిగిన ప్రజాప్రతినిధులు, నాయకులపై దౌర్జన్యాలు చేయడం, బెదిరింపులు చేయడం భావ్యం కాదని చర్చ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల్లో జోరుగా చర్చ జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని సోషల్ మీడియాలో వారి వారి సంభాషణలు విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.

ఆ సంభాషణలు సామాన్య ఓటర్ల ఫోన్లలోకి వెళ్లడంతో ఈ బెదిరింపుల ఆడియో సంభాషణలపై నియోజకవర్గంలో జోరుగా చర్చ జరిగింది. దీంతోపాటు ఆర్మూర్ మున్సిపల్ లోని మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల నియామకం, ఆర్మూర్ అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ఏర్పాటు ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న పట్టించుకోకపోవడంతో నాయకుల్లో అలక ఉన్నట్లు పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పినట్లు తెలిసింది. ఈ అంశంతో బిఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి నాయకులు పని చేస్తున్నా మంటే చేస్తున్నామన్న తరహాలో ఎన్నికల ప్రచారంలో ఫోటోలకు ఫోజులిస్తూ, సోషల్ మీడియా గ్రూపుల్లో పెడుతూ మామ అనిపించుకున్న తరహాలో చేసినట్లు తెలుస్తుంది.

పైడి విజయానికి దోహదం చేసిన సేవా కార్యక్రమాలు

ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఆదర్శ గ్రామం అంకాపూర్ గ్రామానికి చెందిన పైడి రాకేష్ రెడ్డి విజయానికి ఆయన సేవా కార్యక్రమాలు విస్తృతంగా దోహదం చేశాయి. పైడి రాకేష్ రెడ్డి కూతురు పైడి సుచరిత రెడ్డి, ఆయన సతీమణి పైడి రేవతి రెడ్డిలు ఆర్మూర్ నియోజకవర్గంలో గత మూడు నెలలుగా విస్తృతంగా రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ ఫౌండేషన్ అందించే సేవలను ప్రజలకు వివరించారు. రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంతో పాటు మరీ ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు రూపాయికి వైద్య సేవలు విస్తృతంగా ప్రజలకు వివరించారు.

ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఇదివరకే ప్రారంభించి కొనసాగిస్తున్న రూపాయి వైద్య సేవలను ఆర్మూర్ ప్రజలకు పలువురికి అందించి ప్రజల మెప్పును పొందారు. దీంతోపాటు ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాకేష్ రెడ్డి తో పాటు, ఆయన సతీమణి రేవతి రెడ్డి, కూతురు సుచరిత రెడ్డి, ప్రతినిధులు జానకంపేట సంతోష్ రెడ్డి, అంకాపూర్ సురేష్ రెడ్డి లతోపాటు ఆయన ప్రధాన మద్దతుదారులు ప్రజలకు విస్తృతంగా నగదు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రాకేష్ రెడ్డి ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆర్మూర్లో రాకేష్ రెడ్డి విజయానికి దోహదం చేసినట్లు తెలుస్తుంది.

దీంతో పాటు గురడి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆశన్న గారి జీవన్ రెడ్డికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాల అందించిన ఈ సామాజిక వర్గం , అదే వర్గానికి చెందిన ఆర్మూర్ నియోజకవర్గానికి స్థానికుడైన, తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామానికి చెందిన పైడి రాకేష్ రెడ్డి రాజకీయ ఆరంగ్రేటంతో గురడి రెడ్డి సామాజిక వర్గం రెండు వర్గాలుగా విడిపోయి రాకేష్ రెడ్డి విజయానికి కృషి చేసినట్లు కనబడుతుంది. దీంతోపాటు టిఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన పలువురు మున్నూరు కాపు కులానికి చెందిన ప్రజా ప్రతినిధులు సైతం ఈ ఎన్నికను ఆశామాషీగా తీసుకోకుండా మొత్తం వారి భుజస్కందాలపై వేసుకొని రాకేష్ రెడ్డి గెలుపును తీవ్రంగా కృషి చేసినట్లు తెలుస్తుంది.

ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బెదిరింపులకు గురైన బిసి ప్రజాప్రతినిధులు, ప్రధానంగా ఆ సామాజిక వర్గాలకు చెందిన మున్నూరు కాపు, గౌడ, పద్మశాలి, తదితర బీసీ సామాజిక ప్రజలందరూ బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షించి సంపూర్ణంగా మద్దతు తెలిపినట్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే అవగతం అవుతుంది.

Next Story

Most Viewed