Godavari Bridge : సూసైడ్‌ స్పాట్‌గా గోదావరి బ్రిడ్జి.!

by Sumithra |
Godavari Bridge : సూసైడ్‌ స్పాట్‌గా గోదావరి బ్రిడ్జి.!
X

దిశ, నవీపేట్ : జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే వారికి బాసర గోదావరి బ్రిడ్జి అడ్డాగా మారింది. గలగల పారే గోదారిలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. చదువులమ్మ ఒడిలో ఓనమాలు దిద్దిన విద్యార్థులు కూడా గంగమ్మలో తనువులు చాలిస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం, చదువులో వెనుకబాటు కారణం ఏదైనా పరిష్కారం ఆత్మహత్యనే భావిస్తున్న అభాగ్యులు బాసర గోదావరి బ్రిడ్జినే ఎంచుకుంటున్నారు. సరస్వతీ మాత అనుగ్రహంతో జీవితంలో ఉన్నతస్థాయి రావాల్సిన వారు గోదారిలో దూకి కాటికి పోతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 20 నుంచి 30 మంది వరకు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి గోదావరి పరిసరాల్లో దూకి ప్రాణాలు పోగొట్టుకున్న కేసులు ఇటు నవీపేట్, అటు బాసర పోలీస్ స్టేషన్లలో అధికంగా నమోదవుతున్నాయి.

వేధింపులు భరించలేక నిజామాబాద్ పట్టణం న్యాల్ కల్ రోడ్ ఏరియా కు చెందిన వేణు, అనురాధలు తమ కూతురితో సహా గోదావరిలో దూకగా అక్కడే ఉన్న స్థానికులు మహిళను కాపాడగా తండ్రి, కూతుళ్లు గల్లంతయ్యారు. ఎంసెట్ కోచింగ్ తరగతులు అర్థం కావడం లేదని, పేరెంట్స్ ఆశలు తీర్చలేక పోతున్నాననే ఆవేదనతో మండలంలోని నాగేపూర్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సూర్య తేజ గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో స్థానిక యంచగ్రామ యువకులు రక్షించారు. గతంలో నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకొని కన్నవారికి, కుటుంబానికి తీరని శోకం మిగిల్చారు.

ప్రతి సంవత్సరం సుమారు 20 మందికి పైగా, ఈ సంవత్సరం ఏప్రిల్ నెల వరకు సుమారు పది వరకు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. కొన్ని పోలీసులకు సమాచారం లేకుండానే ఘటనలు జరుగుతున్నాయి. గత నెలలో నిజామాబాద్ గౌతమ్ నగర్ కు చెందిన ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను గోదావరిలో తోసి తాను గోదావరిలో దూకిన వెంటనే చూసిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ స్పందించి జాలరులకు కేకలు వేయగా రక్షించారు. ఇలంటి ఘటనలు తరచుగా జరుగుతున్న పదుల సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం స్పందించకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాలకు తెగించి రక్షిస్తున్నారు...

తమ సమస్యలతో గోదావరిలో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్న వారిని స్థానిక యంచ గ్రామానికి చెందిన యువత, జాలర్లు ప్రాణాలు తెగించి కాపాడుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 20 మంది గోదావరి బ్రిడ్జి పరిసరాల్లో గంగలో దూకేందుకు ప్రయత్నించే వారిని కాపాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా స్థానికుల, జాలర్ల కంటపడిన వారు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఎవరూ గుర్తించని వారు తమ ప్రాణాలు వదులుతున్నారు.

ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి...

బాసర గోదావరి పై నవీపేట్ మండలంలోని యంచ నుంచి బాసర వరకు గల బ్రిడ్జిపై రక్షణ గోడ ఎత్తుగా లేక పోవడంతో ఆత్మహత్య చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. బ్రిడ్జి పై ఉన్న రక్షణ గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో గోదావరిలో దూకడానికి అనువుగా ఉంది. యంచనుంచి బాసర వరకు గల బ్రిడ్జికి ఇరు వైపులా ఎత్తైన రక్షణ గోడ లేక ఫెన్సింగ్ ఏర్పాటుతో ఆత్మహత్యల ప్రయత్నాలు తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇరు జిల్లాల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వీటితో పాటు పోలీస్ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంటే కొంతమేర ప్రాణాలు కాపాడొచ్చని స్థానికులు కోరుతున్నారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ సమస్య పై స్పందించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.. లహరి ప్రవీణ్, మాజీ సర్పంచ్, యంచ

గోదావరి బ్రిడ్జి వద్ద ఆత్మహత్యల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలి. గ్రామస్తులు, జాలర్లు బాధితులను కాపాడుతున్నా ఎవరూ గుర్తించని వారు ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. బ్రిడ్జి వద్ద ఫెన్సింగ్ తో పాటు జాలిని ఏర్పాటు చేయాలి. వీటితో పాటు బ్రిడ్జిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

Advertisement

Next Story

Most Viewed