నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు వెంటనే పూర్తి చేయాలి

by Sridhar Babu |
నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు వెంటనే పూర్తి చేయాలి
X

దిశ, కామారెడ్డి : ఆర్ధిక సంవత్సరం గడువు సమీపిస్తున్నందున బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బ్యాంకర్లను కోరారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎంజీవై, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై బ్యాంకర్లు, జిల్లా సమన్వయ కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వివిధ పథకాల కింద యూనిట్ల గ్రౌండింగ్ నిమిత్తం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి గ్రౌండ్ అయ్యేలా చూడాలని కోరారు.

రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని, జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా ఆరుతడి పంటలు, అంతర్గత పంటలు, హార్టికల్చర్, ఆక్వా కల్చర్, సౌర పలకల ఏర్పాటు పై ప్రోత్సహించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని, నాబార్డ్ డీడీఎం కు సూచించారు. 2023-24 సంవత్సరంలో పంట రుణాలు, టర్మ్ లోన్స్, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విద్య, గృహనిర్మాణం తదితర రంగాలకు పబ్లిక్, ప్రైవేట్, ప్రాంతీయ గ్రామీణ, సహకార బ్యాంకుల ద్వారా రూ 5,569 కోట్ల 35 లక్షలు అందించాలని లక్ష్యం కాగా గత త్రైమాసికం వరకు రూ 3,444 కోట్ల 72 లక్షలు అందించి 62 శాతం లక్ష్యం సాధించామన్నారు.

ఇందులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు గాను రూ. 2,225. 30 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో రూ. 357. 70 కోట్లు, ప్రాధాన్యత రంగాలైన విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు రూ.136.05 కోట్లు, అప్రాధాన్యత రంగాలకు రూ. 725.67 కోట్లు అందించామన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాలకు రూ. 501.14 కోట్లు, మెప్మా కింద రూ. 48.57 కోట్లు అందించామన్నారు. ప్రధానమంత్రి ఫార్మాలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద131 యూనిట్లు గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు.

జిల్లాలోని 22 బ్యాంకుల ద్వారా అమలవుతున్న వివిధ పథకాల గ్రౌండింగ్ పై సమీక్షించారు. ఈ నెల 26 నుండి మార్చి 1 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా పొదుపు, డిజిటల్ లావాదేవీలు, సైబర్ క్రైం తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి సహాయంతో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఇందుకు సంబంధించి చిన్న నిడివి గల లఘు చిత్రాలు రూపొందించి సినిమా హాళ్లలో ప్రదర్శించడంతో పాటు కళాజాత ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి సుధీర్ భార్గవ్, నాబార్డ్ డీసీఎం ప్రవీణ్ కుమార్, ఎస్బిఐ ఎల్డిఓ తేజదిప్లా బెహ్రా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, పశుసంవర్థక అధికారి సింహారావు, గిరిజన సంక్షేమాధికార్య్ శ్రీనివాస్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు వరదా రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు లక్ష్మి ప్రసన్న, మెప్మా ప్రాజెక్ట్​ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story