విదేశాల నుంచి మద్యం షాపులకు దరఖాస్తులు

by Gantepaka Srikanth |
విదేశాల నుంచి మద్యం షాపులకు దరఖాస్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపు(Liquor Shops)లకు విదేశాల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. యూరప్(Europe), అమెరికా(America) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వచ్చాయి. ఒక్క అమెరికా నుంచే ఇప్పటివరకు 20 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణ గడువును అక్టోబరు 11 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అక్టోబర్​ 11న సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అక్టోబరు 12, 13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, 14వ తేదీన ఆయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీస్తారని వివరించారు.

అదే రోజు కేటాయింపు ప్రకియను పూర్తి చేస్తామని, అక్టోబరు 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇకనుంచి మద్యం షాపులన్ని ప్రైవేటుగా కొనసాగుతాయని తెలిపారు. కాగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని పూర్తిగా ప్రభుత్వం పరంచేసి విక్రయాలు చేసింది. అంతే కాకుండా ధరలను సైతం పెంచడంతో జనాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. దీంతో కొత్త మద్యం పాలసీకి ప్రస్తుత కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత జీవోను సవరించి తెలంగాణలో ఉన్న విధంగా ప్రక్రియను చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed