ప్రజా సంక్షేమానికి అనుకూల బడ్జెట్

by Sridhar Babu |
ప్రజా సంక్షేమానికి అనుకూల బడ్జెట్
X

దిశ, కామారెడ్డి : ప్రజా సంక్షేమానికి అనుకూల బడ్జెట్‌ను సమర్పించినందుకు ఆర్థిక మంత్రి భట్టిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశంసించారు. శనివారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సమగ్ర సంక్షేమంగా అభివర్ణించారు. రూ. 2,75,891 కోట్ల బడ్జెట్‌లో రూ. 98,645 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించినట్టు తెలిపారు. ఇది మొత్తం బడ్జెట్‌లో అపూర్వమైన 35.81 శాతం ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం కేటాయించినట్టు చెప్పారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూతతో కూడిన

అభయ హస్తం (ఆరు హామీలు) అమలు కోసం 53,196 కోట్ల రూపాయలను ప్రతిపాదించినట్లు ఆయన వివరించారు. ఈ హామీల లబ్ధిదారులలో అత్యధికంగా 90-95 శాతం మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందినవారని అన్నారు. రాష్ట్ర మొత్తం జనాభాలో దాదాపు 85 శాతం మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు చేసిందన్నారు. ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమంకు రూ.13,313 కోట్లు, మైనారిటీల సంక్షేమంకు రూ.2,262 కోట్లు, బీసీ సంక్షేమంకు రూ.8,000 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీలో అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు ఉపాధిని పెంపొందించేందుకు దాని సామర్థ్యాన్ని ఎత్తిచూపారు. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టు ఖర్చుతో సహా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి రూ.11,692 కోట్లు కేటాయించామని చెప్పారు. అదనంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రూ.774 కోట్లు కేటాయించడం వల్ల మలక్‌పేటలో ప్రతిపాదిత ఐటీ టవర్‌ల నిర్మాణం వేగవంతం అవుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సాధారణ బడ్జెట్‌లో గణనీయమైన మార్పులను ఊహించవచ్చని, అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఎలా అమలు చేయనుందనే దానిపై ఓట్ ఆన్ అకౌంట్ విస్తృత ప్రివ్యూను అందిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed