తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత

by Sridhar Babu |
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
X

దిశ, భిక్కనూరు : రాత్రి పగలు అన్న తేడా లేకుండా... మొరం దందా జోరుగా సాగుతున్నప్పటికీ, అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్నట్టుగా ఉంది వీరి వ్యవహారం. కొన్ని శాఖల అధికారులు వారితో చేతులు కలపడంతో మొరం మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన ఆయా శాఖల అధికారులే మాఫియాతో కుమ్మకై ఫిర్యాదు దారులపై దాడులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ శాఖలో పనిచేసే ఒక అధికారి మొరం మాఫియా కు నాయకత్వం వహిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేయిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నారు.

ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుందన్న ఉద్దేశంతో ఎవరైనా యువకులు అధికారులకు ఫోన్ చేస్తే, వారి వివరాలు తెలుసుకొని మాఫియాకు సమాచారం అందిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. భిక్కనూరు మండల కేంద్రంలోని పోతుల గుట్ట సమీపంలో జేసీబీ లు పెట్టి మొరం తవ్వకాలు చేయిస్తూ ట్రాక్టర్లలో తరలిస్తుండగా కొందరు యువకులు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఈ విషయాన్ని సదరు అధికారులు మాఫియాకు సమాచారం అందించడంతో, వారు వెంటనే కార్యాలయం వద్దకు చేరుకొని ఫిర్యాదు చేసిన వారిపై దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఈ తతంగమంతా ఒక అధికారి చాంబర్ లో జరిగినప్పటికీ నోరు మెదపకుండా మాఫియాకు

సపోర్ట్ చేసే విధంగా సైలెంట్ గా ఉండిపోయాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బాధితులు దాడి చేసేందుకు వచ్చిన వారితో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. మొరం పోయించుకుంటున్న ఒక వర్గానికి చెందిన వారిని వెంట బెట్టుకొని వచ్చిన మొరం వ్యాపారి కంప్లైంట్ చేసిన యువకులపై ఉసిగొల్పాడు. మీరు ఫిర్యాదు చేయడం వల్లే మాకు మొరం పోయడం నిలిపివేశారంటూ ఆ వర్గం వారు ఫిర్యాదుదారులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పరిస్థితి చేయి దాటుతుందన్న ఉద్దేశంతో బాధిత యువకులు సైలెంట్ గా అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ఇంత వివాదం జరిగినా మొరం మాఫియా మాత్రం ట్రిప్పుల కొద్ది మొరాన్ని ట్రాక్టర్ ల ద్వారా పగలు రాత్రి అని తేడా లేకుండా దందా కొనసాగించడం గమనార్హం.

మాఫియా ఆగడాలపై కలెక్టర్ కు ఫిర్యాదు....

ఫిర్యాదు దారులపై మాఫియా ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలిసి ఫిర్యాదు చేయాలని బాధిత యువకులు నిర్ణయించారు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టే వ్యాపారం చేస్తూ అడ్డుకున్న వారిపై దాడులకు సైతం దిగేందుకు యత్నించడాన్ని సీరియస్ గా తీసుకున్న బాధిత యువకులు కంప్లైంట్ చేయాలని నిర్ణయానికి వచ్చారు.

Advertisement

Next Story