బైక్ దొంగల అరెస్ట్... రిమాండ్ కు తరలింపు

by Sridhar Babu |
బైక్ దొంగల అరెస్ట్... రిమాండ్ కు తరలింపు
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ డివిజన్ పరిధిలోని బీర్కూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇద్దరు బైక్ దొంగలను పట్టుకొని అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ టి. సత్యనారాయణ వెల్లడించారు. బీర్కూర్ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి నిందితులను పాత్రికేయుల ముందు హాజరు పరిచారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ శనివారం ఉదయం సమయంలో బీర్కూర్ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో బీర్కూర్ కమాన్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ పై బీర్కూర్ వైపునకు వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకొని విచారించారు. బోధన్ పట్టణంలోని అనిసా నగర్ కు చెందిన అబ్దుల్ సలీమ్ కుమారుడు మహమ్మద్

అబ్దుల్ ఐయాజ్ ఖాన్ అనే కుకింగ్ మాస్టర్, అదేవిధంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ కు చెందిన సయ్యద్ రఫీక్ కుమారుడు మహమ్మద్ సమీర్ ఉద్దీన్ అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిగా గుర్తించామన్నారు. వీరిద్దరూ కలిసి ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తాగుడుకు బానిసై, గత నెల రోజుల నుండి కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బాన్సువాడ, బీర్కూర్, సదాశివ నగర్, గాంధారి, బిక్కనూరు, అలాగే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, నిజామాబాద్, కమ్మర్ పల్లి, ఇందల్వాయి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని పెద్ద శంకరం పేట్, కల్హెర్ పోలీస్ స్టేషన్లతో పాటు ఇతర ప్రాంతాలలో మోటార్ బైక్ లను దొంగిలించారని ఆయన తెలియజేశారు.

వీరు ప్రధానంగా ఇండ్ల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలనే దొంగిలించేవారని పేర్కొన్నారు. వారి వద్ద నుండి 21 పల్సర్, ఒక హోండా స్ప్లెండర్, ఒక హోండా యాక్టివా, ఒక రాయల్ ఎన్ ఫీల్డ్, ఒక హెచ్ ఎఫ్ డీలక్స్, ఒక హోండా వాహనాలు కలిపి మొత్తం 26 ద్విచక్ర వాహనాలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు. ఈ కేసును ఛేదించిన బాన్సువాడ రూరల్ సీఐ పి. సత్యనారాయణ గౌడ్, బీర్కూర్ ఎస్ ఐ రాజశేఖర్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story