- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ACB Nazar : ఇందూరు పై వీడని ఏసీబీ నజర్…టెన్షన్ లో ప్రభుత్వ ఉద్యోగులు
దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారి పనిపడుతోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరిని కూడా ఏసీబీ అధికారులు విడిచి పెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్ చేసి మరీ చిక్కించుకుంటోంది ఏసీబీ. పలు శాఖల్లోని అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పలు అవినీతిపరులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారుల తనిఖీలే ఇందుకు నిదర్శనం. జిల్లాల్లో ఏసీబీ అధికారులు పలు శాఖలపై దాడులు చేయడం అవినీతి అధికారులు, సిబ్బంది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. జిల్లాలో వరుస ఏసీబీ దాడులతో ప్రభుత్వ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది.
నిజామాబాద్ కార్పొరేషన్ లో మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ దాడులు జరిగి వారం కూడా కాలేదు. తాజాగా నగరంలోని కోట గల్లి ఎస్సీ బాలికల హాస్టల్ లో కూడా మంగళవారం ఏసీబీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా సోదరులు నిర్వహించారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారుల చూపు ఏఏ ప్రభుత్వ శాఖల పైన ఉందోనని ఉద్యోగులు భయపడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో ఉద్యోగులు భయంతో పనులు చేస్తున్నట్లు చెబుతున్నారు. క్రిటికల్ గా ఉన్న పనులకు సంబంధించి ఒక్క ఫైల్ ను కూడా ఉద్యోగులు ముట్టుకోవడం లేదని తెలుస్తోంది.
ఏ ఫైలు ముట్టుకుంటే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నట్లు చెబుతున్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు కొద్ది రోజులు సెలవులో వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు తోటి ఉద్యోగులతో చెప్పుకుంటున్నారని తెలిసింది. ముఖ్యంగా ఆర్మూర్, కామారెడ్డి, భీంగల్ మున్సిపాలిటీలపై ఏసీబీ నజర్ సీరియస్ గా ఉందని, పక్కా సమాచారంతో ఏదో ఒక రోజు ఆయా మున్సిపాలిటీల అవినీతి అనకొండలపై ఏసీబీ పంజా కచ్చితంగా పడుతుందని ఆయా మున్సిపాలిటీల ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. ఆర్ అండ్ బి, ఇరిగేషన్ అధికారులపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్లు ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ధరణిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన రెవెన్యూ ఉద్యోగులు ఏసీబీ భయంతో భూములకు సంబంధించిన ఏ ఫైలు కూడా ముట్టుకోవడం లేదని, ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటున్నారని బాధిత రైతులు అంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి నరేందర్ ఇంట్లో దొరికిన అవినీతి సొత్తు కోట్లల్లో ఉండడంతో ఒక్కసారిగా సాధారణ జనాల్లో కూడా అధికారుల అవినీతి పడగా ఏ స్థాయిలో ఉందో చర్చకు దారితీసింది. ఒక్క ఉద్యోగిని వారి స్థాయిని బట్టి అవినీతి ఎంత మేర ఉంటుందోనని జనాలే అంచనాలేసుకునే పరిస్థితి వచ్చింది.
ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో జరిగిన అవినీతి విషయంలో అధికారులపై అనేక ఆరోపణలున్నాయి. సదరు అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుల అందినప్పటికీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని ఓ మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కొన్నాళ్లుగా ఒకే చోట పాతుకుపోయి భూముల పంచాయతీలో కోట్లు సంపాదించాడని కార్యాలయ ఉద్యోగులే చెప్తుండడం గమనార్హం.
తహసీల్దార్ గా ఎవరు వచ్చినా ఆ అధికారిని మంచిగా చేసుకొని ఆయనకు నమ్మిన బంటుగా ఉండి ముడుపుల వ్యవహారంలో మధ్యవర్తిగా ఉంటూ అన్ని చెక్కబెట్టే సామర్థ్యం ఉన్న అధికారి కావడంతో ఆయనది కార్యాలయంలో ఆడిందే ఆట పాడింది పాటగా సాగుతోందని కిందిస్థాయి ఉద్యోగులు అనుకుంటున్నారు. కార్యాలయంలో ఆయన చెప్పిందే తహసీల్దార్ కు వేదమన్నంతగా చలాయించుకుంటున్నారు. ఇలాంటి అధికారులు అక్కడక్కడ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెవెన్యూ ఉద్యోగులే గొనుక్కుంటున్నారు. జిల్లా వైద్య శాఖలో కూడా అవినీతి చేపల చిట్టా ఏసీబీ చేతికి చిక్కినట్లు తెలుస్తుంది. ఏదో ఒక రోజు ఏసీబీ మరోసారి ఏదో ఒక శాఖపై పిడుగుల పంజా విసిరే అవకాశం ఉందని తెలుస్తోంది.