జోరుగా మూడు ముక్కలాట.. రూ.లక్షల్లో చేతులు మారుతున్న క్యాష్

by Shiva |
జోరుగా మూడు ముక్కలాట.. రూ.లక్షల్లో చేతులు మారుతున్న క్యాష్
X

కాలక్షేపం కోసం మొదలైన పేకాట వ్యసనంగా మారుతోంది. మూడు ముక్కలాట లో ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. సర్వస్వం పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. డబ్బు పోగొట్టుకుని ఆవేదనలో మద్యానికి బానిసవుతున్నారు. అప్పుల బాధ భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు రూ. లక్షల్లో చేతులు మారుతున్నాయి. మండలంలో పేకాట మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.పోలీసులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేసినా పలువురు అడ్డాలు మారుస్తూ ఆటను కొనసాగిస్తున్నారు. ఆవారా గాళ్ల నుంచి బడాబాబుల వరకు జోరుగా పేకాట ఆడుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మూడు ముక్కలాటలో మునిగితేలుతున్నారు. మరికొంతమంది మండల శివారులోని గ్రామాల్లో వ్యవసాయ క్షేత్రాల వద్ద రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ప్రతీరోజు అడ్డాలు మారుస్తున్నారు.

దిశ, తాడ్వాయి : సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులను గుల్ల ఆకు పచ్చని కాపురంలో పేకాట చిచ్చు పెడుతోంది. వ్యసనానికి బానిసలైన ఎందరో నిలువ నీడను కూడా కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఉమ్మడి మండలంలోని పలు గ్రామాల్లో పగలూ రాత్రీ తేడా లేకుండా యధేచ్చగా పేకాట ఆడుతున్నారని ఉమ్మడి మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆటలో ఓడిన వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్న అక్కడే అప్పుగా బారు వడ్డీకి,చక్రవడ్డీకో ఇస్తుంటారని వినిపిస్తుంది. దీనికి తోడు గ్రామాలలో బెల్ట్ షాప్ లలో ఏ సమయంలో అయిన మద్యం అందుబాటులో ఉండడంతో ముక్క చుక్కతో పేకాట రాయుళ్లకు అట బెల్ట్ షాప్ నిర్వాహకులకు ఆదాయవనరులుగా మారుతున్నాయి. ఈ వ్యసనానికి బానిసలైన అనేక మంది ఆస్తులు పోగొట్టుకొని రోడ్డున పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

పట్నం నుంచి పల్లెల్లోకి..

పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలకే పరిమితమైన పేకాట..అదే పత్తాలాట ఇప్పుడు మారుమూల గ్రామాలకు విస్తరించదంతో కుటుంబలన్ని ఛిద్రమవుతున్నయి.ధనవంతులు,రియల్​ ఎస్టేట్​, చీకటి వ్యాపారాలు బాగా సంపాదించిన వారు ఈ ఆటలో ఎంజాయ్​ చెయ్యడం చూసాం.కాని ఉమ్మడి తాడ్వాయి మండలంలో సాధారణ వ్యక్తులు సైతం పేకాట జోరుగా సాగిస్తున్నన్నట్లు తెలుస్తోంది.నిన్నటి మొన్నటి దాకా నాలుగైదు గ్రామాలకే పరిమితమైన పత్తాలాట ఐదారు గ్రామాలకు వ్యాపించినట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యసనానికి బానిసలైన వ్యక్తులు అప్పుల పాలు కావడంతో వారి కుటుంబలు రోడ్డున పడుతున్నయి.

ప్రత్యేక సెంట్రీ ఏర్పాటు..

పేకాట స్థావరాలకు ఇతరులు ఎవరైనా వస్తే ముందస్తు సమాచారం ఇవ్వడానికి కొందరు నిర్వాహకులు ప్రత్యేక సెంట్రీ వ్యవస్థను నిర్వహిస్తున్నాట్లు జోరుగా ప్రచారంసాగుతుంది.పేకాట స్థావరాల చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న సెంట్రీలు,పేకాట ఆడే ప్రదేశంలో అనుమానిత వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచుతారు. పోలీసులు గానీ, అనుమానిత వ్యక్తులు గానీ సంచరించినట్లయితే వెంటనే నిర్వాహకులకు సమాచారం అందిస్తారు. దీంతో నిర్వాహకులు అప్రమత్తమై తప్పించుకోవడానికి వీలుకల్పించుకుంటున్నారు.

పేకాట వ్యసనానికి గురై ఇల్లు..గుల్లా

పేకాట రాయుళ్లు డబ్బులు పెట్టే స్థాయిని బట్టి గ్రూపులుగా విభజించి ఆట ఆడుతుంటారు.రూ. వెయ్యి నుంచి ప్రారంభించి రూ. 10 వేల వరకు ఆటలను నిర్వహిస్తున్నారు.పేకాట కారణంగా పలు కుటుంబాలను రోడ్డున పడుతున్నాయి. మద్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు పేకాట వ్యసనానికి గురై ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. అసలే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు వ్యసనం బారిన పడి ఆర్థిక చిక్కులను కొనితెచ్చుకుంటున్నారు.ఏదేమైనా చట్టవిరుద్ధమైన పేకాటపై ఉక్కుపాదం మోపాలని, ఈ తతంగం నడిపిస్తున్న వ్యక్తులపైసంబంధిత అధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం: వేంకటేశ్వర్లు, ఎస్సై

పేకాట రాయుళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పేకాట ఆడడంతో కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. మండలంలో పేకాట ఆడే వారు ఉంటే మానుకోవాలి. ఒకవేళ పేకాట ఆడినా, వాటిని ఆడించిన సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.

Next Story

Most Viewed