నిజామాబాద్ జిల్లా బడా భీంగల్‌లో ఘనంగా ఊర పండగ

by srinivas |
నిజామాబాద్ జిల్లా బడా భీంగల్‌లో ఘనంగా ఊర పండగ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆషాడ మాసం వచ్చిందంటే చాలు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎటు చూసినా ఊర పండగ ఉత్సవాలే... అమ్మవారికి బోనాల ఊరేగింపులే దర్శనమిస్తాయి. గ్రామాల్లో కుల సంఘాల ఆధ్వర్యంలో కులాల వారీగా, సంఘాల ఎవరికి వారే ప్రత్యేకంగా జరుపుకుంటారు. భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలో ఊరపండగలో భాగంగా మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో బోనాలు, మంగళ హారతులు చేత పట్టుకుని మహిళలు ముందు నడవగా వలగొడుగు ఊరేగింపు నిర్వహించారు. చేపలు వేటాడే కొత్త వలకు గొడుగులాగా పైకి లేపి వల చివరన కొత్త చీరను చుట్టి వేప ఆకులను కట్టి రంగు రంగుల బట్టలతో గాలి ఊదిన బెలూన్లను కట్టి అలంకరించారు. వల గొడుగును ఊళ్లో డప్పుల చప్పుళ్ల మధ్య భక్తితో ఊరేగించారు. వలను తాము గంగమ్మ తల్లిగా భావించి అలంకరిస్తామని, పిల్లా పాపలు, సకల ప్రాణికోటి చల్లంగా ఉండాలని, గ్రామం, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండాలని, వర్షాలు విస్తారంగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని పూజిస్తామని మత్స్యకార సంఘం నాయకులు ఎల్లుల్ల భూమేశ్వర్, పల్లెమీది అనిల్, హోటల్ పోషన్న, ప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story