రైతుల గోడు పట్టించుకునేదెవరు..

by Sumithra |
రైతుల గోడు పట్టించుకునేదెవరు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరిట సంబరాలు నిర్వహిస్తుంది. రెండవ రోజు అయిన శనివారం రైతు దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రధానంగా రైతులతో, మార్కెట్ యార్డులలో, రైతు వేదికల వద్ద ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. రైతులు పండించేందుకు సాగునీటిని, ఉచిత కరెంట్ ను ఇస్తున్నామని వారు పండించిన ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారే కానీ వాస్తవ రూపానికి వచ్చేసరికి రైతులకు డబ్బుల చెల్లింపునకు నిధులకు లేక వారు కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. రబీ 2022-23 సీజన్ కు సంబంధించిన వరి కోతకు వచ్చే సమయంలో ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షం రైతుల కన్నీళ్ళనే మిగిల్చింది. ఎకరాలకు ఎకరాలు వరి పొలాల్లోనే కుంగిపోయింది. కానీ రైతులకు మాత్రం నష్టపరిహారం అందలేదు. ప్రభుత్వం 10వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించినా రైతుల ఖాతాలో జమకాలేదు.

రైతులు నానా కష్టాలు పడిధాన్యం నూర్పిడి చేసి ఆరబోసిన కొనుగోలు చేసే వారే కరువైన విషయం తెలిసింది. గత నెల 14న ప్రారంభమైన ధాన్యం కొనుగోలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కనీసం ధాన్యం తూకంవేసిన మిల్లింగ్ కు, లారీలకు ఎత్తేవారే కరువై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధాన్యం సేకరించిన రోజుల్లోనే వారి ఖాతాల్లోనే నగదు జమచేస్తామని చెబుతున్నా అది అమలు కావడం లేదు. దాంతో పంటల నూర్పిడి, కోతలు, మిషన్ల కోసం, కూలీల కోసం చేసిన అప్పులు పెరిగి లబోదిబోమంటున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 900 కోట్ల ధాన్యం తాలుకు డబ్బులు రైతుల ఖాతాలో జమ కాలేదు. ప్రభుత్వం సంబరాలు నిర్వహిస్తుండగా రైతులు మాత్రం ధాన్యం డబ్బులు మహోప్రభో వేడుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లాలో శనివారం వరకు 6,14,197 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. దాని తాలుకు రైతులకు రూ.1265.24 కోట్లు చెల్లించాల్సి ఉంది. శనివారం వరకు 3,33,038 మెట్రిక్ టన్నుల ధాన్యంకు సంబంధించి 686.06 కోట్లు మాత్రమే చెల్లించారు. రైతులకు ధాన్యం తాలుకు డబ్బులు చెల్లించేందుకు రూ.250.70 కోట్ల ఇండెంట్ పెట్టినా నిధులు విడుదల కాలేదు. జిల్లాలో కేవలం 60,255 మంది రైతులకు మాత్రమే చెల్లింపులు జరిగాయి. జిల్లాలో మరో 600 కోట్ల ధాన్యం డబ్బుల కోసం రైతులకు ఇప్పటికి ఎదురు చూపులు తప్పడం లేదు. ధాన్యం సేకరణలో తరుగు తీస్తున్నారు కాపాడండి అని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా పట్టించుకోలేదు. దాదాపు ఒక్కొక్క క్వింటాల్ కు 7 కిలోల నుంచి 10 కిలోల తరుగు తీసినా ఒక్క రైసుమిల్లుపై కూడా ఉమ్మడి జిల్లాలో చర్యలు తీసుకోలేదు.

సివిల్ సప్లయ్ కార్పొరేషన్ వద్ద ఉన్న డబ్బులతో ధాన్యం కొనుగోలు చేసి చెల్లింపులు చేసిన తర్వాత కార్పొరేషన్ అధికారులు చెల్లింపుల విషయంలో చేతులెత్తేశారు. ప్రతీ సీజన్ లో ప్రభుత్వం గ్యారెంటీ గా ఉండి సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కు రుణాలను ఇప్పించి ధాన్యం సేకరణ చేయడం సర్వసాధారణం. కానీ ఈసారి ప్రభుత్వం గ్యారెంటీగా ఉండేందుకు ఆలస్యం చేయడంతో ధాన్యం తాలుకు రైతులకు చెల్లించాల్సిన డబ్బులకు ఇబ్బంది తప్పలేదని సమాచారం. రెండు మూడు రోజుల క్రితం ఆలస్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై రుణాలను తీసుకునేందుకు గ్యారెంటీ సంతకం చేసినా డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడానికి మరికొన్ని రోజులు సమయం పట్టేలా ఉందని చెబుతున్నారు. వచ్చే యాసంగి సీజన్ లో పంటలు ముందుగా వేయాలని ప్రభుత్వం చెబుతూ రైతులకు మాత్రం ధాన్యం కొనుగోళ్ల డబ్బులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కామారెడ్డి జిల్లాలో 344 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేశారు. అందులో 340 మాత్రమే తెరిచి 337 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 170 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. మిగిలిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,23,274.160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. జిల్లాలో 665.94 కోట్ల ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ శనివారం వరకు 552.90 కోట్ల ధాన్యం తాలుకు వివరాలను ట్యాబ్ లో ఎంట్రీ చేశారు. 525.37 కోట్ల ధాన్యం తాలుకు ట్రక్ షీట్లను మాత్రమే రూపొందించారు. మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం విలువ 498.37 కోట్లుగా చెబుతున్నారు. శనివారం నాటికి జిల్లాలో రూ.348.65 కోట్లు మాత్రమే చెల్లించారు. 1,69,245.295 మెట్రిక్ టన్నుల ధాన్యం తాలుకు మాత్రమే డబ్బులు చెల్లించారు. ఇంకా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం డబ్బులను చెల్లించలేదు. జిల్లాలో 58,968 మంది రైతుల నుంచి 3,23,257.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా కేవలం 32,480 మంది రైతులకు 1,69,848 మెట్రిక్ టన్నుల ధాన్యంకు సంబంధించిన 348 కోట్లు మాత్రమే చెల్లించారు. దాదాపు 310 కోట్ల వరకు ధాన్యం డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed