- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలిటికల్ అస్త్రంగా హైడ్రా.. బీఆర్ఎస్ దూకుడు.. బీజేపీ వెనుకడుగు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇప్పుడు హైడ్రా ఫంక్షనింగ్, అది చేస్తున్న కూల్చివేతలు పార్టీల మధ్య మంటలు రాజేస్తున్నాయి. రాజకీయ అస్త్రంగా మలచుకోడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేసి రైతులతో కలిసి ఆందోళనలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్‌కు ఆశించినంత స్పందన రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా ఆ నది పరివాహక ప్రాంతంలోని రివర్ బెడ్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పేద కుటుంబాల్లో అశాంతికి కారణమైంది. అధికారులు క్షేత్రస్థాయిలో కూల్చేయాలనుకున్న ఇండ్లకు రెడ్ మార్క్ వేయడం ఆ కుటుంబాల్లో ఆందోళనకు దారితీసింది. ఈ అంశాన్ని టేకప్ చేసిన బీఆర్ఎస్.. ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ సెంటర్‌ను ఓపెన్ చేసి ఉచితంగా లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి న్యాయవాదుల్ని నియమించింది. కూల్చివేతలకు వ్యతిరేకంగా బీజేపీ సైతం గొంతు విప్పినా అది స్టేట్‌మెంట్లకు, మీడియా సమావేశాలకే పరిమితమైంది.
బీఆర్ఎస్‌కు అస్త్రమైన హైడ్రా..
మూసీ నది ఒడ్డున ఉన్న పేదల ఇండ్లను కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ రాజకీయంగా బలమైన అస్త్రంగా మార్చుకోడానికి దోహదపడింది. బీజేపీ సైతం అదే రాగం అందుకున్నా బీఆర్ఎస్‌తో పోలిస్తే వెనకబడే ఉన్నది. రాష్ట్ర పార్టీ నాయకత్వం బలంగా లేకపోవడం, స్టేట్ పార్టీ చీఫ్ కిషన్‌రెడ్డి జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉండడంతో ఇక్కడి వ్యవహారాలపై ఫోకస్ పెట్టలేకపోయారని, ఆయన రాగానే ఆందోళనలు చేపడతామని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. పేదల ఇండ్లను బుల్డోజర్లు కూల్చడానికి వస్తే ముందుగా అవి తమ మీద నుంచే వెళ్లాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నందున ఆ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో రివ్యూ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులతో సమీక్షించే అవకాశాలూ లేకపోలేదు.
అధికారులు హామీలు ఇచ్చినా..
ఏక కాలంలో మూసీ నది సుందరీకరణ ప్రోగ్రామ్, మరోవైపు అక్రమ ఆక్రమణల కూల్చివేత పనుల్లో హైడ్రా అధికారులు నిమగ్నం కావడం పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో అలజడికి కారణమైంది. హైడ్రా వ్యవస్థపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా ద్వారా పేద కుటుంబాలకు క్లారిటీ ఇచ్చినా ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి షిప్టు చేయడం, సొంత పట్టాలు ఉన్నవారికి ఆర్థిక సాయం.. ఇలాంటి హామీలను ప్రభుత్వం, అధికారులు ఇచ్చినా పేద కుటుంబాలు బీఆర్ఎస్‌ను ఆశ్రయిస్తున్నాయి. ఒకవైపు ప్రజా భవన్‌లో ప్రతీ వారం రెండు రోజులపాటు ప్రజావాణి జరుగుతున్నా, గాంధీ భవన్‌లో వారానికి ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటున్నా బాధిత కుటుంబాలకు ఇక్కడకు రాకుండా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆశ్రయించడం గమనార్హం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితర పలువురు మంత్రులు హైడ్రా విషయంలో క్లారిటీ ఇచ్చినా అధికారుల స్థాయిలో మీడియా ద్వారా వివరణ ఇచ్చినా ఇండ్లు కోల్పోతున్న వారిలో భరోసా ఏర్పడలేదు.
గ్రాఫ్ పెరిగినట్లు బీఆర్ఎస్‌లో ధీమా
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేని పరిస్థితుల్లో, ఆ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ చతికిలపడిందనే భావన ప్రజల్లో నెలకొన్నది. రుణమాఫీ ఆందోళన పిలుపునకు రైతులు పెద్దగా స్పందించకపోయినా హైడ్రా విషయంలో పేద కుటుంబాలు మాత్రం స్వచ్ఛందంగా తెలంగాణ భవన్‌కు రావడం ఆ పార్టీ నేతల్లో సరికొత్త ఆశలు రేకెత్తించింది. ప్రజలు కదిలినప్పుడు ఆందోళనలను ముందుండి నడిపించడంతో ఫలితాలు వస్తాయన్న కేసీఆర్ ఆలోచన హైడ్రా బాధితుల రూపంలో కార్యరూపం దాల్చింది. ఈ అంశాన్ని గట్టిగా పట్టుకుని ప్రభుత్వ మెడలు వంచాలన్నది బీఆర్ఎస్ లక్ష్యం. హరీశ్‌రావు మూడు రోజులుగా బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అండగా ఉంటామని భరోసా కల్పించడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ కాస్త పెరిగిందనే ధీమా నేతల్లో వ్యక్తమవుతున్నది. బీజేపీ పుంజుకోవాల్సినంతగా లేనందున పొలిటికల్ మైలేజ్ గణనీయంగా వచ్చిందని, దీన్ని బలమైన ప్రచార, పబ్లిసిటీ అస్త్రంగా మల్చుకోవాలని భావిస్తున్నది.
నేరుగా రంగంలోకి రేవంత్‌రెడ్డి
హైడ్రాకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. జమ్మూకశ్మీర్ ఎన్నికల తుది దశ పోలింగ్ అక్టోబర్ 5న పూర్తికానున్నందున ప్రచార పర్వం 3వ తేదీకి ముగిస్తే ఆ తర్వాత కిషన్‌రెడ్డి రాష్ట్రానికి రాగానే చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని బీజేపీ భావిస్తున్నది. అప్పటికల్లా పరిస్థితిని పూర్తిగా తమవైపు తిప్పుకోవాలన్నది బీఆర్ఎస్ ఉద్దేశం. మరోవైపు హైడ్రా విషయంలో ప్రజలకు ఎంతగా క్లారిటీ ఇచ్చినా పరిస్థితి అనుకూలంగా మారకపోవడంతో ఒకటి రెండు రోజుల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. హైడ్రా, మూసీ బ్యూటిఫికేషన్ అంశాలను, ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి బాధితులకు ప్రభుత్వం ఏ తరహాలో అండగా ఉంటుందో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారని తెలిసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ హైడ్రాను భూతంగా చూపిస్తున్నదని, పేద కుటుంబాలను ముంపు నుంచి కాపాడేందుకు మూసీ ఒడ్డు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్న అంశాన్ని మరోసారి నొక్కిచెప్పే అవకాశమున్నది. బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళనలు పెంచాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎత్తుగడలకు రేవంత్ బ్రేక్ వేయడంపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొన్నది.