సొంత నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు షాక్.. ఈటలకు జై కొట్టిన బీఆర్ఎస్ నేతలు

by Javid Pasha |   ( Updated:2023-10-18 10:20:31.0  )
సొంత నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు షాక్.. ఈటలకు జై కొట్టిన బీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ అసమ్మతి నేతలందరూ ఒక్కటయ్యారు. గజ్వేల్‌లోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో అసంతృప్త నేతలందరూ భేటీ అయ్యారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో నేతలందరూ ఏకతాటిపైకి వచ్చారు. అందరూ కలిసి గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్ఎస్‌లో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్త నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంత పనిచేసినా సముచిత స్థానం దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈటల వెంట నడవాలని భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ఈటల అనేకసార్లు ప్రకటించారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించి తీరుతానంటూ చెబుతూ వస్తోన్నారు.

గజ్వేల్‌లో పోటీకి సిద్దమవుతున్న ఈటల.. అందుకు తగ్గట్లు సిద్దమవుతున్నారు. బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలు ఈటలకు జై కొడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలను సమన్వయం చేసుకునే బాధ్యతలను మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. నేతలకు టచ్‌లో ఉండటంతో పాటు నియోజకవర్గంలో శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేస్తోన్నారు. ఈటల పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో గజ్వేల్‌పై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story