సైలెంట్‌ మోడ్‌లో కేసీఆర్, కేటీఆర్.. దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్ కేడర్

by karthikeya |   ( Updated:2024-10-07 03:08:42.0  )
సైలెంట్‌ మోడ్‌లో కేసీఆర్, కేటీఆర్.. దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్ కేడర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి లీడర్ కావలెను..! కీలక సమయాల్లో పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేవారు కరువయ్యారు. వరదల సమయంలో, హైడ్రా ఇష్యూ, పీఏసీ చైర్మన్ వివాదం టైంలోనూ ఇరువురు అందుబాటులో లేరు. పార్టీ కేడర్‌కు గైడెన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో గులాబీ పార్టీకి మరో కీలక నేత అవసరమనే చర్చ పార్టీలో జరుగుతోంది. ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్ ఉంటేనే ఆపద సమయంలో వారి మధ్యలో ఉంటారని, పార్టీని సైతం మరింత బలోపేతం చేసే చాన్స్ ఉందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

అధికారం కోల్పోవడంతో నైరాశ్యంలో పార్టీ

రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ప్రతిపక్షానికే బీఆర్ఎస్ పరిమితం కావడంతో పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు. ప్రజాతీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ పార్టీకి ఘోరమైన ఫలితాలు రావడంతో ప్రజలకు దూరంగా ఉన్నారు. ఫాం హౌస్‌కే పరిమితమయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌లో భారీ నష్టం జరిగింది. ఖమ్మంలో వరద బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలోనూ గులాబీ అధినేత బయటకు రాలేదు. భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. హైడ్రా, మూసీ సుందరీకరణపై సైతం కేసీఆర్ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. బాధితులకు బాసటగా నిలిచే ప్రయత్నం చేయలేదు. పీఏసీ చైర్మన్ విషయంలోనూ నోరు మెదపలేదు. కేవలం పార్టీ నేతలతోనే స్టేట్‌మెంట్ ఇప్పించారనే ప్రచారం జరిగింది.

కీలక సమయంలో ఫారిన్ టూర్‌లో కేటీఆర్

ప్రజలు ఇబ్బందులు పడుతున్న కీలక సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆబ్సెంట్ అయ్యారు. వరదలు వచ్చి ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగినప్పుడు భరోసా కల్పించాల్సిన సమయంలో అందుబాటులో లేరు. ఫారిన్ టూర్‌లో ఉన్నారు. పార్టీ కేడర్‌కు సైతం దిశానిర్దేశం చేయలేదని, దీంతో ప్రజలను ఆదుకోవడంలో పార్టీ వెనుకబడ్డదని పార్టీ లీడర్లే అభిప్రాయం వ్యక్తం చేశారు. హైడ్రా ఇష్యూ తెరమీదకు వచ్చినప్పుడు కూడా కేటీఆర్ ఇతర దేశాల్లోనే ఉన్నారని, దుర్గంచెరువు, ఇతర ప్రాంతాల్లో కూల్చివేతల సమయంలోనూ ప్రజలకు బాసటగా నిలువలేదనే ప్రచారం జరుగుతోంది. పీఏసీ చైర్మన్‌గా గాంధీని నియమించిన సమయంలోనూ కేటీఆర్ లేరు. ఈ ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలతో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. కౌశిక్ ఇంటిపై దాడితో ఒక్కసారిగా పరిస్థితి రసవత్తరంగా మారింది. ఆ సమయంలోనూ కేటీఆర్ లేకపోవడంతో మాజీ మంత్రి హరీశ్‌రావు లీడ్ తీసుకున్నారు. భరోసా కల్పించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తరలివెళ్లి అండగా ఉంటామని హామీ‌ ఇవ్వడంతో పాటు ధైర్యం కల్పించారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చాకే.. కార్యాచరణ!

ప్రజలకు ఆపద సమయంలోనూ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు దూరంగానే ఉండటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్టీ కేడర్‌కు సైతం సరైన గైడెన్స్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. అంతేగాకుండా ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లపై వచ్చి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పెన్షన్ కోసం వృద్ధులు, రైతురుణమాఫీకోసం రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ ప్రకటించకపోవడం, వారిపక్షాన భరోసానిచ్చే కార్యక్రమాలు చేపట్టకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. కేవలం పార్టీ నేతలు ముందుపడి చేస్తున్న ధర్నా, నిరసన కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రజల పక్షాన ఎందుకు పోరాటానికి ప్రత్యక్ష కార్యాచరణ ఎందుకు చేపట్టడం లేదని లీడర్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఎందుకనా? లేకుంటే ప్రజల్లో ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత వచ్చిన తర్వాతనే కార్యాచరణ చేపట్టే ఆలోచన చేస్తుందా? అనేది అంతుచిక్కని ప్రశ్న.

ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు యాక్టివ్

పక్క రాష్ట్రాల్లో ప్రజలకు కష్టం వస్తే అన్ని పార్టీలు ఏకమవుతాయి. వారి సమస్యలపై అధికార ప్రతిపక్షాలు కొట్లాడుతాయి. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ సైతం వరదల సమయంలో ప్రజల్లోకి వచ్చి వారికి భరోసా కల్పించారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రజలకు భరోసా కల్పించలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. హరీశ్‌రావుతో పాటు ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు ఆపద సమయంలో అండగా ఉండాల్సిన పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు దూరంగా ఉంటున్నారనే చర్చ ఇటు పార్టీలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా జరుగుతోంది. మరో బలమైన నేత ఉంటేనే పార్టీ పటిష్టం అవుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story