ఈ హాస్టల్స్‌లో అమ్మాయిల భద్రత గాల్లో దీపమే..!

by karthikeya |
ఈ హాస్టల్స్‌లో అమ్మాయిల భద్రత గాల్లో దీపమే..!
X

దిశ, హనుమకొండ : ఉన్నత చదువు కోసం తల్లితండ్రులకు దూరంగా ఉంటున్న అమ్మాయిలకు రక్షణ కరువైంది. హనుమకొండ జిల్లాలో వందలాదిగా ప్రైవేటు లేడీస్ హాస్టళ్లు వెలిశాయి. గర్ల్స్ హాస్టల్స్​నిర్వహణ ఓ దందాలా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ ఒక్క అనుమతి లేకుండానే, నిబంధనలను పాటించకుండానే హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే విద్యార్థినులు అవుటింగ్ కు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

గాలిలో దీపంల అమ్మాయిల భద్రత ..

హన్మకొండలో ప్రైవేటు హాస్టళ్లలో గర్ల్స్ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను వేదిస్తున్న పోకిరీలు హాస్టళ్ల వద్ద మకాం వేస్తున్నారు. చదువుకుందామని వచ్చిన వారిని తప్పుదోవ పట్టిస్తున్న దుర్మార్గులు ఉన్నారు. అయితే అమ్మాయిల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఉండాల్సిన హాస్టల్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గర్ల్స్ హాస్టళ్లలో ఉండే విద్యార్థినుల భద్రతపై నిశ్చితంగా ఉండవచ్చని భావిస్తున్న తల్లిదండ్రులకు నిర్వాహకుల వైఖరి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎడ్యుకేషన్ హబ్ ఉన్న హన్మకొండలో గర్ల్స్ హాస్టళ్లు ఎలాంటి అనుమతుల్లేకుండానే విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, లాంగ్, షార్ట్ టర్మ్ కోచింగ్, వివిధ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న విద్యార్థినులు, యువతులకు గర్ల్స్ హాస్టల్స్ నిలయంగా మారుతున్నాయి. గతంలో హాస్టల్ నిర్వాహకులు సెక్యూరిటీ గార్డులు గా మహిళలను పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. ప్రతీ హాస్టల్ పరిసరాల్లో సీసీ టీవీల పర్యవేక్షణ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకునే వారు. ఇప్పుడు చాలాచోట్ల అలాంటి ఏర్పాట్లే లేవు ఒక వేళ ఎక్కడైనా ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదంటున్నారు. కనీస రక్షణ చర్యలు చేపట్టని హాస్టల్ నిర్వాహకులను మందలించే అధికారులు లేరని బాలికలు వాపోతున్నారు.

తనిఖీలే మరిచిన అధికారులు..

హన్మకొండ లోని గర్ల్స్ హాస్టళ్లలో అధికారుల తనిఖీలు లేకపోవడమే గమనార్హం. హన్మకొండ నక్కలగుట్ట, కిషన్ పుర, హన్మకొండ చౌరస్తా, హంటర్ రోడ్డు, సుబేదారి, గోపాల్ పుర్, రామారం, భీమారం, ఏరియాల్లో వందల సంఖ్యలో గర్ల్స్ హాస్టల్స్ ఉండటం గమనార్హం. సహజంగానే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఆయా హాస్టళ్లలో చేర్చుతున్న తల్లిదండ్రులకు నిర్వాహకుల వైఖరితో భయాందోళనలే మిగులుతుండడం గమనార్హం. వరంగల్ కమిషనరేట్ చుట్టూ పక్కల ఉన్నటువంటి గర్ల్స్ హాస్టళ్లలో కూడా తనిఖీలు లేకపోవడం, అధికారులు ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయన్న విషయాన్నే మరిచారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో హాస్టల్లో కనీసం 50 మందికి పైగా విద్యార్థినులు ఉంటున్నారు. వారికోసం తయారు చేసే ఆహార పదార్థాలు నాణ్యతను పరిశీలించే నాథుడే లేడు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రం అధికారులు హడావుడి చేసి ఆతర్వాత మౌనం వహిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రైవేట్ హాస్టళ్లలో జరిగే ఆక్రమాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని బాలికల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

రూ.వేలల్లో ఫీజు వసూలు..

పట్టణంలో ఎక్కువగా రాజకీయ నాయకుల బంధువులు , వారి అనుచరులు అనుమతులు లేకుండానే ఈ గర్ల్స్ హాస్టళ్లు నిర్వహిస్తుండడం గమనార్హం. పట్టణాల్లో 2 బీ హెచ్ కే, 3 బీ.హెచ్ కే రూమ్ లను అద్దెకు తీసుకొని వాటినే హాస్టల్స్ గా మార్చేసి చిన్న చిన్న గదుల్లో పరిమితికి మించి విద్యార్థినులు, యువతులు ఉంచుతున్నారు. వారినుంచి ముక్కు పిండి మరీ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణంగా కంబైన్డ్ రూం అయితే రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. కాస్త మెరుగైన సౌకర్యాలు కలిగి ఉండి, గదులు విశాలంగా ఉన్న హాస్టళ్లలో రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఏసీ, రూంకు ఇద్దరు మాత్రమే ఉంటే రూ.8 వేల వరకు

వసూలు చేస్తున్న హాస్టళ్లు ఉన్నాయి. నిర్వాహకులు, ఏసీ, నాన్ ఏసీ, సపరేట్ రూం, కంబైన్డ్

రూం, మెనూ, స్పెషల్ మెనూ ఇలా అనేక రకాలుగా చార్జీలను వసూలు చేస్తున్నారు. కళాశాల ఫీజులకు మించి కూడా మొత్తాన్ని హాస్టల్ కు చెల్లిస్తున్నా, సరైనఫుడ్, వసతులు, భద్రత ఉండడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

సమయ పాలన పాటించని ప్రైవేట్ హాస్టళ్లు..

హాస్టల్ గేటు దాటితే తమకేం సంబంధం లేదన్నట్లుగా కొందరు ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. విద్యార్థినుల రక్షణపై తప్పించుకునే వైఖరి చేస్తున్నారు. వాస్తవానికి చాలా ప్రైవేటు హాస్టళ్లలో సీసీ కెమెరాలు కానరావడం లేదు. వాచ్​మన్లు ఉండడం లేదు. అర్ధరాత్రి వరకూ పోకిరీలు గర్ల్స్ హాస్టల్స్ ఎదుట మకాం వేస్తూ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హాస్టళ్ల ఎదుట ప్రేమ పేరుతో పోకిరీ గాళ్ల ఆగడాలు కనిపిస్తున్నా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోని పట్టణంలో వెలిసిన వందలాది ప్రైవేట్ గర్ల్స్ హాస్టళ్లను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed