Scam Alert: మల్టీలెవల్ మార్కెటింగ్ కేటుగాళ్ల కొత్త ట్రిక్.. తెలంగాణ పోలీస్ అలర్ట్

by Ramesh N |   ( Updated:2025-01-28 12:00:40.0  )
Scam Alert: మల్టీలెవల్ మార్కెటింగ్ కేటుగాళ్ల కొత్త ట్రిక్.. తెలంగాణ పోలీస్ అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరాల(Cyber Crimes) పై ప్రజల్లో అవగాహన ఇప్పుడిప్పుడే వస్తుండటంతో రోజుకో కొత్త రకం నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో విధంగా ప్రజలను నమ్మించి వారి ఖాతా పూర్తిగా ఖాళీ చేయాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. బాగా చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల మాయలో పడి లక్షలు, కోట్లు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం సైబర్ కేటుగాళ్లు కొత్త పన్నాగం రచిస్తున్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో కేటుగాళ్లు (multi-level marketing) మల్టీలేవల్ మర్కెటింగ్‌పై కన్నేశారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా (Telangana Police) తెలంగాణ పోలీస్ అధికారిక ఖాతా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా ఆసక్తికర పోస్ట్ చేసింది.

మల్టీలెవల్ మార్కెటింగ్ కేటుగాళ్లు కొత్త ట్రిక్ అని తెలంగాణ పోలీస్ పేర్కొంది. మల్టీలెవల్‌ మార్కెటింగ్ మాయలో పడకండని సూచించింది. ఇంట్లో ఉంటూనే సంపాదించ వచ్చు అనే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని తెలిపింది. ప్రోడక్ట్‌ల పేరిట చైన్ లింక్ మర్కెటింగ్, ఇంట్లో సామాన్లు, మెడిసిన్ కొంటే లాభాలంటూ మోసాలు జరుగుతాయని అలర్ట్ చేసింది. ముఖ్యంగా గృహిణిలకు సదావకాశమంటూ ఊదరగొట్టే ప్రకటనలు ఇస్తారని, మీతో పాటూ నలుగురిని చేర్చుకోవాలని అంటూ బ్రెయిన్ వాష్ చేస్తారని పేర్కొంది. పేరు ఏదైనా అక్కడ జరిగేది పచ్చి మోసమేనని, మల్టీలెవల్ మార్కెటింగ్ జోలికి వెళ్లొద్దని, మీతో పాటూ మరికొందరిని బలి చేయొద్దని తెలంగాణ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్కామ్ అలర్ట్ అంటూ రీ ట్వీట్ చేస్తూ అవగాహన కల్పించారు.

కాగా, దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయని పోలీస్ శాఖ నివేదికలు చెబుతున్నాయి. చదువుకోలేని వారితో పాటు విద్యావంతులు, వ్యాపారస్తులు, సంపన్నులు కూడా వీరి వలలో పడి సొమ్ములను పోగొట్టుకుంటున్నారు. 2024లో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22812 కోట్లు కాజేసినట్టు నివేదికలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో సైబర్ వలలో 1,20,869 మంది బాధితులు ఉన్నారు. ఇక 17,912 మందికి రూ.183 కోట్లు సైబర్ క్రైమ్ పోలీసులు రిఫండ్ చేయించడం గమనార్హం.

Next Story