ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్ళీ నర్సిరెడ్డినే

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-10 07:50:19.0  )
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్ళీ నర్సిరెడ్డినే
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి 2025 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో యుటీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డినే మరోసారి పోటీకి నిలపాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( టీఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకుంది. నర్సిరెడ్డి గత ఐదున్నర సంవత్సరాలుగా శాసన మండలి సభ్యునిగా విద్యారంగం అభివృద్దికి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రశంసనీయమైన కృషి చేశారని ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పేర్కొంది. వివిధ యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలతో పాటు వివిధ వర్గాల ప్రజాసమస్యలను కౌన్సిల్ లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేశారంది. ఆయన సేవలకు గుర్తింపుగా మరొక సారి శాసన మండలి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లుగా రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

కాగా టీఎస్ యుటిఎఫ్ ప్రకటించిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని ప్రభుత్వ జూనియర్ కళాశాల జూనియర్ లెక్చరర్స్ సంఘం, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపక సంఘం, మోడల్ స్కూల్ సంఘం, 5 రకాల గురుకుల ఉపాధ్యాయ సంఘాలు మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, జనరల్ సొసైటీ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.

Advertisement

Next Story