దీపాదాస్ మున్షీ పరువు నష్టం కేసులో ట్విస్ట్.. BJP మాజీ ఎమ్మెల్యేకు నాంపల్లి కోర్టు నోటీసులు

by Satheesh |
దీపాదాస్ మున్షీ పరువు నష్టం కేసులో ట్విస్ట్.. BJP మాజీ ఎమ్మెల్యేకు నాంపల్లి కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ పరువు దావా నష్టం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల (ఆగస్ట్) 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన న్యాయమూర్తి.. ఈ మేరకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు సమన్లు జారీ చేయాలని ఆధికారులను ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 30వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ బెంజ్ కారు గిఫ్ట్‌గా తీసుకుని ఒకరికి కాంగ్రెస్ టికెట్ ఎంపీ ఇప్పించారని.. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎన్వీఎస్ఎస్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ ఇష్యూపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఈ క్రమంలోనే ప్రభాకర్ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న మున్షీ తనపై అసత్య ఆరోపణలు చేశారని నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఆగస్ట్ 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు నోటీసులు జారీ చేసింది.



Next Story