Nalla Venkateshwarlu: చివరకు నీళ్లు కూడా కేసీఆర్ ఆదేశాలతోనే నింపారు

by Gantepaka Srikanth |
Nalla Venkateshwarlu: చివరకు నీళ్లు కూడా కేసీఆర్ ఆదేశాలతోనే నింపారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) నిర్మాణంలో గత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్లనీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్‌కు చేరుకున్నాయి. వ్యాప్కోస్ రూపొందించిన డీపీఆర్‌లో తొలుత లెక్కలేసుకున్న అంచనా వ్యయాన్ని ఆ తర్వాత కొన్ని సవరణలతో పెంచడానికి అప్పటి సీఎం హోదాలో కేసీఆర్(KCR) ఆమోదం తెలిపారని రిటైర్డ్ ఈ-ఇన్-సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు(Nalla Venkateswarlu) తెలిపారు. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్‌లో భాగంగా మూడు రోజుల పాటు 277 ప్రశ్నలకు ఆయన నుంచి జస్టిస్ ఘోష్(Justice Ghosh) సమాధానాలు రాబట్టారు. అంచనా వ్యయం పెంచాలనే నిర్ణయంతో పాటు మూడు బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్‌లను ఖరారు చేయడానికి కూడా కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు కమషన్‌కు వివరించారు. జస్టిస్ ఘోష్ ఎదుట సోమవారం హాజరైన నల్లా వెంకటేశ్వర్లు... మౌఖికంగా చెప్పిన సమాధానాలన్నింటికి సంబంధించిన డాక్యుమెంట్లను, సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మినిట్స్ కాపీలను అందజేశారు. చివరకు బ్యారేజీలలో నీళ్లు నింపడానికి సైతం ప్రభుత్వ పెద్ద (అప్పటి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) నుంచే ఆదేశాలు వచ్చాయని తెలిపారు.

తొలుత రూపొందించిన డీపీఆర్‌(DPR)లో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ అధికారులు చేసిన ప్రతిపాదనలను వివిధ సమావేశాల్లో చర్చించామని, చివరకు సీఎం హోదాలో కేసీఆర్(KCR) విధాన నిర్ణయం తీసుకుని ఆ ప్రపోజల్స్‌కు ఆమోదం తెలిపారని నల్లా వెంకటేశ్వర్లు వివరించారు. అన్నారం బ్యారేజీ యాక్సిస్‌కు సంబంధించి డీపీఆర్‌లో స్పష్టమైన నిర్ణయం ఉన్నా కేంద్ర జల సంఘం ఆమోదం లభించిన తర్వాత మార్పులు జరిగాని మూడు రోజుల ముందు చెప్పిన అంశాన్ని ధృవీకరించే తీరులో డాక్యుమెంట్లను, కమ్యూనికేషన్ ఉత్తర్వులను కమిషన్‌కు అందజేశారు. బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్‌లు ఫైనల్ కావడానికి ముందు నిర్వహించిన జియో టెక్నికల్ ఫౌండేషన్ మ్యాప్‌లను, డ్రాయింగ్‌లను, టెక్నికల్ వివరాలను తెలియజేసే డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. మూడు బ్యారేజీలకు సంబంధించిన విడివిడి డీపీఆర్‌లను, అంచనా వ్యయాన్ని, టెక్నికల్ అంశాల ప్రతులను కూడా కమిషన్‌కు ఇచ్చారు. షీట్ పైల్స్, సీకెంట్ పైల్స్, వెంట్స్, ఫ్లడ్ ఛానెల్స్ తదితర అంశాలను వివరించే డాక్యుమెంట్లను కూడా అందజేశారు.

మేడిగడ్డ బ్యారేజీలో ఏడవ బ్లాకులోని కొన్ని పిల్లర్లు భూమిలోకి కుంగిపోవడానికి, డ్యామేజీ కావడానికి దారితీసిన కారణాలపై జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా.. ఆపరేషన్, మెయింటెనెన్స్ లేకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం, డిశ్చార్జి పరిమాణం ఎక్కువగా ఉండడం, ఎనర్జీ డిస్సిమేషన్‌లో అంచనాలు తప్పడం కారణాలుగా పేర్కొన్నారు. అప్పటి సీఎంగా కేసీఆర్ ఆదేశాలతోనే మాగ్జిమమ్ స్థాయికి నీటిని స్టోర్ చేయాల్సి వచ్చిందని, టెక్నికల్‌గా టెయిల్ వాటర్ లభ్యత లేకపోవడం, గేట్ల ఆపరేషన్ సక్రమంగా లేకపోవడం కూడా ప్రధాన కారణాల్లో కొన్ని అని కమిషన్‌కు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో పనిచేసిన సీఈ, ఎస్ఈ, ఈఈల పేర్లను తీసుకున్న జస్టిస్ ఘోష్... సీకెంట్ పైల్స్ వాడాలంటూ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ ఇచ్చిన ఆదేశాలు, సూచనలకు సంబంధించిన ఫైళ్ళను కూడా కమిషన్‌కు అందజేశారు. బ్యారేజీల నిర్మాణానికి తప్పనిసరిగా అవసరమైన అనుమతుల జాబితాను కూడా అందించారు. తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చి లేబొరేటరీ చేసిన 2-డీ, 3-డీ స్టడీ రిపోర్టులను కూడా ఇచ్చారు.

బ్యారేజీల నిర్మాణంలో ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్ నిబంధనలన్నింటినీ పాటించామని, చీఫ్ ఇంజినీర్‌గా తాను పనుల తీరును పరిశీలించడానికి, తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు గుర్తించిన లోపాలను కాంట్రాక్టు ఏజెన్సీల దృష్టికి తీసుకెళ్ళానని, వాటిని తాను సమర్పించిన అఫిడవిట్‌లోనే పొందుపర్చినట్లు నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో (ఎగువ ప్రాంతం) నీటి నిల్వ లేనందున పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో, సీకెంట్ పైల్స్ పరిస్థితి ఏమిటో, సిమెంటు కాంక్రీటు శ్లాబ్‌లు ఎందుకు కొట్టుకపోయాయో, ఆప్రాన్ ఎందుకు దెబ్బతిన్నదో.. వీటన్నింటినీ ఇప్పుడు తనిఖీ చేస్తే టెక్నికల్ అంశాలు వెలుగులోకి వస్తాయా?... నిర్దిష్టమైన కారణాలను అంచనా వేయడం వీలవుతుందా?.. అంటూ నల్లా వెంకటేశ్వర్లును ప్రశ్నించగా సానుకూల సమాధానం వెలిబుచ్చారు. మూడు బ్యారేజీలకు సంబంధించి ఒరిజినల్ డీపీఆర్‌లో ఏమున్నదో, వాటికి సవరణలు ఎప్పుడు జరిగాయో, దాన్ని ప్రతిపాదించి ఎవరో, చివరకు ఆమోదం తెలిపింది ఎవరో అన్ని సమావేశాల మినిట్స్ కాపీలు కమిషన్ దగ్గరకు చేరడంతో తదుపరి విచారణ సందర్భంగా కీలకంగా మారనున్నది.

ఇప్పటివరకూ టెక్నికల్ అంశాలపై పూర్తి ఫోకస్ పెట్టిన జస్టిస్ ఘోష్... ఆర్థిక అంశాలు, విధాన నిర్ణయాలకు సంబంధించిన ఎంక్వయిరీ, క్రాస్ ఎగ్జామినేషన్‌ను త్వరలో చేపట్టనున్నారు. ఆర్థిక అంశాలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సహా ఇరిగేషన్ డిపార్టుమెంటులోని అకౌంట్స్ విభాగం, ఫీల్డ్ ఇంజినీర్ల ప్రతిపాదనలు, హై పవర్ కమిటీలో జరిగిన చర్చలు, ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాలు... ఇవన్నీ ప్రస్తావనకు రవచ్చే అవకాశాలున్నాయి. ఈ అంశాల క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగానే ఇరిగేషన్ డిపార్టుమెంటుకు అప్పట్లో సెక్రెటరీలుగా వ్యవహరించిన బ్యూరోక్రాట్లు కూడా హాజరయ్యే అవకాశమున్నది. ఆ తర్వాతి దశలో విధాన నిర్ణయాలు తీసుకున్న పెద్దల నుంచి వివరాలను రామట్టవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story