ఎస్సారెస్పీ జలాలు ఎప్పుడొస్తయో.. ఈ సారి మరింత ఆలస్యమేనా..?

by Nagam Mallesh |
ఎస్సారెస్పీ జలాలు ఎప్పుడొస్తయో.. ఈ సారి మరింత ఆలస్యమేనా..?
X

దిశ, తుంగతుర్తి : సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాలకు వర ప్రధాయినిగా మారిన శ్రీరాంసాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాల విడుదల నేడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఈ ఖరీఫ్ సీజన్ లో నీటి విడుదల జరుగుతుందా...? లేదా..? అనే విషయాన్ని ఎవరు కూడా ఖరాకండిగా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ నీటి విడుదల జరిగితే ఎప్పుడు..? అనే ప్రశ్నకు కూడా సమాధానం రావట్లేదు. అయితే ఎస్సారెస్పీ నీళ్ల కోసం రైతాంగం మాత్రం ఆశతో ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ఎలాంటి నీటి ప్రాజెక్టులు లేని తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం ప్రతి ఏటా తొలుత పుష్కలంగా పడే వర్షాలు అనంతరం వచ్చే ఎస్సారెస్పీ రెండో దశ నీటిపై ఆధారపడుతూ వ్యవసాయ సాగులో ముందుకు పోతోంది. అయితే ఈసారి ఖరీఫ్ ప్రారంభమైన నాటి నుండి సరైన వర్షాలు పడలేదు. వచ్చిన వర్షాలైనా చుట్టపు చూపు లాగానే ప్రవర్తించాయి. శ్రీరామ్ సాగర్ రెండో దశ నీటి కోసం ఎదిరి చూడబడ్డారు. కానీ నేడు ఆ నీటికి కూడా మోక్షం లేకుండా పోయింది.

ముఖ్యంగా ప్రతి ఏటా ఖరీఫ్ తో పాటు రబీ సీజన్ లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం ద్వారా (ఎల్ఎండి) నీటి విడుదల జరిగి ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రాంతం నుండి మొదలయ్యే రెండో దశ కాలువల ద్వారా మైలారం, కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి నీళ్లు చేరితేనే సూర్యాపేట జిల్లా రైతాంగంలో ఆశలు మొదలవుతాయి. ఎందుకంటే సూర్యాపేట జిల్లాకు నీళ్లు విడుదల జరిగేది బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే కనుక. అయితే ఈసారి కరీంనగర్ జిల్లా పై భాగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడి (లోయర్ మానేరు డ్యాం) ఎల్ఎండిలోకి నీళ్లు రావడంలో తీవ్ర ఆలస్యమైంది. చివరికి రెండు రోజుల నుండి అక్కడి పై భాగంలో ఉన్న మిడ్ మానేరు డ్యాం నుండి ఎల్ఎండిలోకి 15 వందల నుండి 2 వేల క్యూసెక్కుల వరకు నీళ్లు వస్తున్నాయని ఆ ప్రాజెక్టు (ఎల్ఎండి) ఇంజనీరింగ్ అధికారులు ఆదివారం “దిశ”కు తెలిపారు. 24 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన ఎల్ఎండిలో ప్రస్తుతం నిల్వ ఉన్న 5 టీఎంసీల నీళ్లను తాగునీటికి వాడుకుంటుండగా ప్రస్తుతం ప్రాజెక్టులోకి వచ్చే నీటితో అక్కడి ప్రాంత వ్యవసాయ సాగుకు నీటి విడుదల చేసిన పిదపనే మిగిలిన నీటిని వరంగల్ జిల్లా వైపు ప్రభుత్వం నిర్ణయించే షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తామని చెబుతున్నారు.అయితే ఆ ప్రాజెక్టులోకి ఆశించినంతగా నీళ్లు రావడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది.ఒకవేళ అక్కడ నీటి విడుదల జరిగితే మధ్యలో ఉన్న మైలారం,బయ్యన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి చేరడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఇటు సూర్యాపేట జిల్లా వైపు నీటి విడుదల జరిగే షెడ్యూలు విడుదలలో తీవ్ర జాప్యం ఏర్పడింది. వాస్తవానికి ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ప్రతి ఏడాది నీటి విడుదలపై (సూర్యాపేట జిల్లాకు) ఆగస్టు రెండు లేదా మూడో వారంలోనే ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేస్తుంది. కానీ పై స్థాయిలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఆగస్టు మాసం పూర్తవుతున్నప్పటికీ కూడా షెడ్యూల్ విడుదల కాలేదు.ఇదిలా ఉంటే పుష్కలంగా వర్షాలు పడడంతో పాటు ఎస్సారెస్పీ జలాలు కూడా వస్తాయనే ఆశతో తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలతో పాటు తిరుమలగిరి (ఈ మండలంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే) ప్రాంతంలో దాదాపు లక్ష ఎకరాల వరి పంట సాగయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు సూత్రప్రాయంగా వివరిస్తున్నారు. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఆశించినంతగా నీళ్లు ఇక పోవడంతో పంటల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

Advertisement

Next Story

Most Viewed