Operation ROR : రైతాంగం మెడకున్న ధరణి గుదిబండ తెగేనా..?

by Sumithra |   ( Updated:2024-08-07 13:27:44.0  )
Operation ROR : రైతాంగం మెడకున్న ధరణి గుదిబండ తెగేనా..?
X

దిశ, నాగార్జునసాగర్ : గత బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ధరణి పోర్టల్ పుణ్యమాని వేల ఎకరాల భూమికి సంబంధించి వివరాలు రికార్డుల్లో తప్పుల తడకగా మారిపోయాయి. భూమిని ఎప్పుడో అమ్ముకున్న వాళ్ల పేర్ల మీదనే ధరణి పోర్టల్‌లో కొత్తగా రికార్డు నమోదవ్వడం.. ఎకరాల్లో ఉన్న భూమి గుంటలుగా నమోదవ్వడం.. పట్టా భూములు అసైన్డ్, వక్ఫ్ భూములుగా నమోదుకావడం. ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ భూమి రికార్డుల్లోకి ఎక్కడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ధరణి పోర్టల్‌లో ప్రతీదీ సమస్యే. ఇదే అదునుగా వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, కాందిశీకులకు సంబంధించిన భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకు రికార్డుల్లోకి ఎక్కడం వంటి ఉదంతాలు ఇప్పటికే ఎన్నో బహిర్గతమయ్యాయి. ఫలితంగా రైతాంగం ధరణి పోర్టల్‌తో పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు.

చిన్న చిన్న కరెక్షన్లు చేసేందుకు ఏండ్ల తరబడి ఎదురుచూసిన సందర్భాలు లేకపోలేదు. ఆఖరికి ఎకరాల భూమి ఉండి కూడా తమ అవసరాలకు అమ్ముకోలేక నరకయాతన పడుతున్న రైతులు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలు. అయితే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక.. ధరణి సమస్యలకు చరమగీతం పాడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ సమస్యలపై ప్రత్యేకంగా ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమస్యలు, వినతులు, ఫిర్యాదులన్నింటినీ క్రోడీకరించి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.

తిరుమలగిరి(సాగర్)లో మొదలైన సర్వే..

భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్షేత్రస్థాయి భూ సర్వే బుధవారం ప్రారంభమయ్యింది. సీసీఎల్ఏ కార్యదర్శి నవీన్ మిట్టల్ తిరుమలగిరి(సాగర్) మండలానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తుండడం గమనార్హం. అధికారులు రైతులతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి కాస్తు, కబ్జా ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. మొదటి రోజు తిరుమలగిరి మండలంలోని తిమ్మయ్యపాలెం శివారులోని సర్వే నంబర్ 39, చింతలపాలెం శివారులోని సర్వే నంబరు 162, తునికి నూత శివారులోని సర్వే నంబరు 45లో భూసర్వే నిర్వహించారు.

ఈ సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత గ్రామ నోటీసు బోర్డులో ఉంచనున్నారు. ఆ వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు రైతాంగానికి సూచిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. నిజానికి ప్రస్తుతం అధికారులు చేస్తున్న అధ్యయనం సమస్యలు ఉన్న భూములపైనే. ఈ తరుణంలో ఏ రైతుకు అనుకూలంగా వివరాలు ఉన్నా.. అపోజిట్ రైతు అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో ఆ సమస్య పరిష్కారం కావడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వెలువడుతుంది.

పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి(సాగర్) మండలం..

అయితే కొత్త ఆర్ఓఆర్ చట్టం రూపొందించేందుకు పైలెట్ ప్రాజెక్టుకుగా రాష్ట్ర సర్కారు తిరుమలగిరి(సాగర్) మండలాన్ని ఎంపిక చేసింది. అందులో భాగంగానే ఆరుగురు తహసీల్దార్లతో ప్రత్యేకంగా ఉన్నతస్థాయి రెవెన్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి ఇప్పటికే కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చింది. నేటి నుంచి 15 రోజుల పాటు ఈ బృందం తిరుమలగిరి(సాగర్) మండలంలోని గ్రామాల్లో సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సుల్లో ఇప్పటివరకు పరిష్కారం కాకుండా ఉన్న భూసమస్యలకు రైతాంగం నుంచి నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తులు తీసుకుంటారు. ప్రతి దరఖాస్తుదారుడి నుంచి తీసుకున్న ఆధారాలు, రెవెన్యూ రికార్డులతో సరి చూసి సదరు సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉంది.

అయితే ఇక్కడే అసలు సమస్య రానుంది. ఎందుకంటే.. ధరణి పోర్టల్ రాకముందు రెవెన్యూ రికార్డులన్నీ వీఆర్ఓల సమక్షంలో ఉండేది. రైతుల వద్ద ఉండే పాసుపుస్తకాల్లో భూ వివరాలు సక్రమంగా ఉన్నా.. పహాణీలు, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం తప్పులు దొర్లిన సందర్భాలు లేకపోలేదు. అయితే ధరణి పోర్టల్ సమయంలో రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల క్షేత్రస్థాయిలోని వాస్తవాలను పరిగణనలోకి తీసుకులేదు. దీంతో అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. కబ్జాలో ఒకరు ఉంటే.. రికార్డుల్లో మరొకరి పేరు మీద భూమి నమోదయ్యి ఉంది. మరోవైపు రికార్డుల్లో పేరు ఉండడంతో పాటు నిజంగా వాళ్లే భూమి కొనుగోలు చేసినా.. దౌర్జన్యంగా ఇతరులు కబ్జాలో ఉన్నవాళ్లు లేకపోలేదు. దీంతో ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడం రెవెన్యూ అధికారులకు పెద్ద సహసమే అవుతుందని చెప్పాలి.

పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడానికి కారణమిదే..

తిరుమలగిరి(సాగర్‌) మండలంలో వివిధ రకాల భూ సమస్యలు ఉండడం వల్లే రాష్ట్ర స్థాయిలో పైలట్‌ ప్రాజెక్టుగా మండలాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధరణి సమస్యల పరిష్కార కమిటీ సభ్యుడు, లీఫ్‌ ఫౌండర్‌ భూమి సునీల్‌, కోదండరెడ్డి, రాష్ట్ర స్థాయి రెవెన్యూ అధికారులు, ఇతర రెవెన్యూ నిపుణుల బృందం ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో భూసమస్యలు, వాటి కారణాలు, పరిష్కార మార్గాల గురించి చర్చించారు.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి సూచన మేరకు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని తిరుమలగిరి(సాగర్‌) మండలాన్ని ఎంపిక చేశారు. మండలంలో ప్రభుత్వ, పట్టా, కాందిశీకుల, దేవాలయ, వక్ఫ్‌, ఇనామ్‌, అటవీ, ఆబాదీ, పోరంబోకు భూములతోపాటు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామాలకు పునరావాసం కల్పించబడిన భూములు, ఫారెస్ట్‌, రెవెన్యూ సరిహద్దు కలిగి ఉన్న భూముల వంటి విభిన్న భూ సమస్యలు మండలంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి(సాగర్) మండలాన్ని ఎంపిక చేశారు.

తిరుమలగిరిలో ఏండ్లుగా భూసమస్యల తిష్ట..

తిరుమలగిరి(సాగర్) మండలంలో ప్రధానంగా కృష్ణపట్టె ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి. చింతలపాలెం, నెల్లికల్లు, జమ్మనకోట, తిమ్మాయిపాలెం, తునికినూతలలో అత్యధికంగా సుమారు 6,816 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఈ భూములు ఉన్న సర్వే నెంబర్లు 22, 158, 162, 222, 223, 108, 172, 344, 407 తదితర సర్వే నెంబర్లలో వాస్తవ భూ రికార్డుల (ఆర్‌ఎస్ఆర్‌) కంటే అత్యధికంగా పాస్‌ పుస్తకాలు జారీ అయ్యాయి. రెవెన్యూ రికార్డు ప్రక్షాళన సమయంలో ఈ భూములన్నింటినీ అప్పటి ప్రభుత్వం పార్ట్‌-బీలో చేర్చింది. తదనంతరం పలుమార్లు ఈ భూముల్లో కాస్తు, కబ్జాలో ఉన్న రైతులను గుర్తించి కొందరికి పాస్‌పుస్తకాలు జారీ చేసింది. కాగా, నేటికీ పాస్‌పుస్తకాలు పొందలేకపోయిన రైతులు వందల సంఖ్యలో ఉన్నారు. వీరంతా నిత్యం వారి సమస్యల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. చింతలపాలెం, నాయకునితండా, తిమ్మాయిపాలెం, బట్టువెంకన్నబావితండా గ్రామాల్లో కాందిశీకుల భూములు ఉన్నాయి. దేశ విభజన సమయంలో ఇక్కడి నుంచి తరలిపోయిన కాందిశీకుల భూములు కావడంతో వీటిపై సుమారు 70 ఏళ్లుగా కబ్జాలో ఉండి సేద్యం చేస్తున్న రైతులు నేటికీ హక్కులు పొందలేకపోయారు. సర్వే నెంబర్లు 28, 52, 60, 204, 24, 38 లో సుమారు 2,500 ఎకరాల కాందిశీకుల భూముల వివాదం పరిష్కారానికి సంబంధిత రైతులు ఏళ్లుగా రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు.

సాగర్‌ ముంపు గ్రామాలైనా సుంకిశాలతండాలో సర్వే నెంబర్‌ 67లో 1958లో 550 ఎకరాలకు అటవీ భూములకు పాస్‌పుస్తకాలు ఇచ్చినా, నేటికీ సంబంధిత గిరిజన రైతుల వివరాలు 1బీలో లేకపోవడంతో బ్యాంక్‌ల ద్వారా వ్యవసాయ రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హులు కాలేకపోతున్నారు. అదే సర్వే నెంబర్‌లో మిగిలిన భూములకు పాస్‌పుస్తకాలను నేటికీ కొందరు రైతులకు మంజూరుకాలేదు. నాగార్జునపేటతండాలో సర్వే నెం 12, 32లో రెవెన్యూ, ఫారెస్ట్‌ స రిహద్దు ఉండడంతో తండాలో ఆ భూములను పార్ట్‌-బీలో ఉంచడంతో తండాలోని గిరిజనులెవ్వరికీ పాస్‌ పుస్తకాలు రాలేదు. ఎర్ర చెరువు తండాలో 1955 నుంచి 1993 వరకు సర్వే నెం.424లో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా రికార్డయింది. అయితే ఆ భూమిలో ఫారెస్ట్‌ అధికారులు మొక్కలను నాటడంతో వివాదం నెలకొంది. దీంతో ఫారెస్ట్‌, స్థానిక గిరిజన రైతుల మధ్య వివాదం కొనసాగుతోంది. అదేవిధంగా మండల కేంద్రంలో పలు ప్రభుత్వ భూముల్లో వెంచర్లు ఏర్పాటు కావడం, పలు గ్రామాల్లో ప్రభుత్వ, చెరువు శిఖం భూములు, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ఎకరానికి ఒక్కో సమస్య ఉందనే చెప్పాలి.

లీగల్ సమస్యలతో ఛేదించడం గగనమే..

ధరణి పోర్టల్ వల్ల అనేక కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. భూమి లేనోళ్లకు సైతం ధరణి రికార్డుల్లో పేర్లు నమోదవ్వడం వల్ల వారికి లీగల్‌గా ఆధారం చేతికి చిక్కినట్టయ్యింది. ఇదే సమయంలో ఎదుటివారు(వాస్తవంగా అర్హులు)కి సంబంధించి ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటే.. ధరణి పోర్టల్ తర్వాత రెవెన్యూ రికార్డులు కొన్నిచోట్ల మాయం అయ్యాయి. అది ఎవరు మాయం చేశారనేది వేరే అంశం. మరోవైపు సర్వే నంబరులో ఎవరు ఒకరు భూ సమస్య వల్ల కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే.. రెవెన్యూ అధికారులు ఆ మొత్తం సర్వే నంబరును నిషేధిత జాబితాలోకి చేర్చారు. అలాంటి విపత్కర సమస్యలతో పాటు లీగల్ చిక్కులను ఈ కమిటీ ఎలా ఛేదిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed