చిత్రం.... విచిత్రం...!ఒకటి కలకల.... మరొకటి వెల వెల

by Kalyani |
చిత్రం.... విచిత్రం...!ఒకటి కలకల.... మరొకటి వెల వెల
X

దిశ,తుంగతుర్తి: విశాలంతో పాటు ఆహ్లాదకరమైన ఒకే ఆవరణ... వేరువేరుగా పక్కపక్కనే బాలురు, బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు. ఇరు పాఠశాలల్లో దాదాపుగా సరిపోయేంత ఉపాధ్యాయ బృందం. చెప్పుకోవడానికి బాగానే ఉంది.... కానీ అందులో విద్యార్థుల సంఖ్య చూస్తే చిత్ర విచిత్రం..! అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లు అనే సామెత మాదిరిగా బాలుర పాఠశాలలో విద్యార్థుల 230 పైబడి సంఖ్యలో ఉంటే బాలికల పాఠశాలలో మాత్రం రికార్డుల ప్రకారం కేవలం 21 మంది మాత్రమే. అయితే వచ్చే వారి సంఖ్య పది లోపే.

ఇది తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత పాఠశాలల దుస్థితి ఇది. బాలుర పాఠశాల 230 కి పైగా విద్యార్థులతో కలకలలాడుతుండగా.. బాలికల పాఠశాలలో వివిధ సబ్జెక్టులు బోధించడానికి గెజిటెడ్ హెడ్మాస్టర్ తో పాటు వివిధ సబ్జెక్టులు బోధించడానికి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య 21లోపు ఉండడంతో బాలికల పాఠశాల వెలవెలబోతోంది. దీంతో ఉపాధ్యాయులు తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పాఠశాలలో తెలుగు,ఇంగ్లీష్ మీడియంలలో బోధన జరుగుతున్నప్పటికీ బాలికలు మాత్రం చేరడానికి మాత్రం ఇష్టపడడం లేదు. పాఠశాలలు తెరిచే ముందు బడిబాట లాంటి కార్యక్రమాలు జరిపి తల్లిదండ్రులతో పాటు వారి పిల్లలను చైతన్య పరిచినప్పుడు కూడా వారంతా ముఖం చాటేస్తున్నారు.పైగా పక్కనే ఉన్న బాలుర పాఠశాలలో చేరుతున్నారు. ఈ సందర్భంగా బాలుర పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పక్కనే ఉన్న బాలికల పాఠశాలలో చేరండంటూ చెప్పుతున్నా ఇష్టపడడం లేదు.

ఇక మండలంలోని తూర్పుగూడెం గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో రికార్డుల ప్రకారం 13 మంది ఉంటే వచ్చే వారి సంఖ్య మాత్రం పదిలోపే. ఇక్కడ బోధనకు ఆరుగురు ఉపాధ్యాయులు ఉండడం విశేషం. కరివిరాల జడ్పీహెచ్ఎస్ లో రికార్డుల ప్రకారం 20 మంది విద్యార్థులు ఉంటే వచ్చే వారి సంఖ్య 15 లోపు. ఇక్కడ కూడా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. బండరామారం గ్రామ జడ్పీహెచ్ఎస్ లో రికార్డులో 25 మంది ఉంటే 21 మంది మాత్రమే వస్తున్నారు.ఈ పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ముఖ్యంగా పాఠశాలలు ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం దారుణంగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed