ఆదర్శ రైతు వ్యవస్థ పునరుద్ధరణకు తొలి అడుగులు

by Aamani |
ఆదర్శ రైతు వ్యవస్థ పునరుద్ధరణకు తొలి అడుగులు
X

దిశ,తుంగతుర్తి: గత ప్రభుత్వ హయాంలో రద్దయిన ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది.ఈ మేరకు రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ జరిపిన తొలి సమావేశంలో చేసిన ప్రతిపాదనను కమిషన్ కమిటీ గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేసింది.ప్రతి రెవెన్యూ గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ వేయి ఎకరాలకు ఒక ఆదర్శ రైతు ఉండే విషయాన్ని ప్రతిపాదనలో స్పష్టంగా పేర్కొన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన వారిలో కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి తో పాటు సభ్యులు చెవిటి వెంకన్న,ఎం.భవాని రెడ్డి,గుడుగు గంగాధర్,రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి,కె.వి నరసింహారెడ్డిలు ఉన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కసరబోయిన లింగయ్య యాదవ్ గురువారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ విధానంలో సమగ్ర మార్పులు తేవాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది ఆదర్శ రైతులను నియమిస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక వారిని తొలగించారని తెలిపారు.వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతూ ఎన్నో మార్లు అప్పటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఫలితం లేదన్నారు.

చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తామని పేర్కొంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిందని తెలిపారు.చివరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా తమ సంఘం తరఫున పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించామని లింగయ్య తెలిపారు.ఇందులో భాగంగానే తొలుత రైతు సంక్షేమ కమిషన్ ను ఏర్పాటు చేయగా ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించే కార్యక్రమాన్ని తీసుకుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed