- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంబురాల్లో అధికారులు.. సమస్యల్లో ప్రజలు..!
దిశ, చిలుకూరు : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అధికారులు తలమునకలై ఉండగా.. నీళ్లివ్వండి మహాప్రభో అంటూ మండలంలోని రామాపురం (కట్టకొమ్ముగూడెం) ప్రజలు దాహం కేకలు పెడుతున్నారు. గ్రామంలో గతంలో నిర్మించిన రెండు గ్రామపంచాయతీ నీటి ట్యాంకులున్నాయి. ఇంటింటికీ తాగు నీళ్లివ్వాలనే భగీరథ పథకంలో భాగంగా ఒక భగీరథ ట్యాంకును నిర్మించారు. ఇంత వరకూ అది సజావుగా పని చేసింది లేదు. విచిత్రమేమిటంటే ఆ ట్యాంకు సమీపంలోని ప్రజలకే తాగునీరు అందదు. గ్రామంలోని జంగాల కాలనీ, రామాలయం వీధి, నిగిడాల వారి వీధి తదితర సగం గ్రామానికి తాగునీరు సరఫరా కాదంటే అతిశయోక్తి కాదు.
పైప్ లైన్లేవి..?
భగీరథ అధికారులు గ్రామంలోని పలు వీధులకు పైప్ లైన్లు వేయడమే మరిచారు. వేసిన వీధుల్లో ట్యాప్ లు బిగించలేదు. కొన్ని వీధుల్లో పైప్ లైన్లు నోరు తెరుచుకుని ఆకాశం వైపు చూస్తున్నాయి. గ్రామంలోని ప్రధాన వీధిలోనే నీటి సమస్య ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదీ ఇంటింటికీ భగీరథ పరిస్థితి. ఇదిలా ఉంటే భగీరథ పైప్ లెన్ల కోసం వీధివీధినా సీసీ రోడ్లను తవ్వేశారు. తిరిగి పూడ్చడం మరిచారు. దీంతో రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి. వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మోటార్ల ఏర్పాటు..
ఈ దుస్థితి గమనించి స్థానిక సర్పంచ్ గతంలో గ్రామంలో ఉన్న బోర్ బావులకు మోటార్లు ఏర్పాటు చేశారు. దాంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే ఎవరికి అవసరమైనప్పుడు వారు బోరు మోటారు వేస్తుండడంతో తరచుగా మోటార్ ఆన్ చేస్తుండడంతో మోటార్ కాలిపోతోంది. దీంతో గ్రామపంచాయతీకి విద్యుత్తు బిల్లు తడిచిమోపెడవుతోంది. భగీరథ సజావుగా నడిస్తే ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాంకర్లు, మినరల్ నీళ్లే ఆధారం..
తాగునీటి సమస్య ఎదుర్కొనేందుకు స్థానికులు కొందరు సొంత ఖర్చులతో నీటి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకుంటున్నారు. పలువురు మినరల్ వాటర్ పై ఆధారపడుతున్నారు. వేయని పైప్ లైన్లు, బిగించని ట్యాప్ లకు కూడా అధికారులు బిల్లులు చేశారా అని పలువురు గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తాగు నీటి సమస్యతో సతమతం..
భగీరథ నీరు ఎప్పుడొచ్చేది రానిది తెలియదు. ఉదయం కొంతసేపు, సాయంత్రం కొంతసేపు గ్రామ పంచాయతీ ట్యాంకు నుంచి నీళ్లిస్తున్నారు. బోర్ మోటార్ ఆధారంగానే నీరు దొరుకుతోంది. పైప్ లైన్లకు ట్యాప్ లు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో ఏమో అంటూ రామాపురం గ్రామస్తురాలు మోతె లక్ష్మి అన్నారు.
సమస్య నిజమే.. పరిష్కారానికి సాధ్యమైన మేర కృషి..
గ్రామంలో తాగునీటి సమస్య ఉన్న మాట వాస్తవమే. గతంలోని బోర్లకు మోటార్లు ఏర్పాటు చేశాం. గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న నర్సింహ్మాపురం నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తెప్పిస్తున్నా. ఈ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు నా హయాంలో జరిగింది కాదు. ఈ విషయమై అధికారులకు పలు మార్లు విజ్ఞప్తి చేశా. బోర్ మోటార్లు తదితర గ్రామపంచాయతీ ఏర్పాట్లకు నెలకు రూ.60 వేల విద్యుత్తు బిల్లు వస్తోంది. కొందరు తమకు భగీరథ నీళ్లే కావాలని పేచీ పెడుతున్నారు. సమస్య పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సర్పంచ్ మీసాల గంగ లింగయ్య తెలిపారు.