- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
18 ఏళ్లుగా ఎదురుచూపు... ఇంకా అందని ద్రాక్షగా వైద్యం
దిశ, హాలియా: పేదలకు ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.80 లక్షలు విడుదల చేసింది. భవన నిర్మాణం సుమారు ఆరేళ్లపాటు కొనసాగి 2012 మార్చి 3న అప్పటి రాష్ట్ర మంత్రులు కుందూరు జానారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డితో ప్రారంభించారు. అప్పటి నిధుల ప్రకారం కేవలం ఆస్పత్రి నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రభుత్వం తిరిగి ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, వైద్య పరికరాల కోసం మరో రూ.80 లక్షలు కేటాయించింది. అనంతరం జరిగిన మార్పులతో కేటాయించిన నిధుల్లో కోతలు విధించడంతో వైద్య పరికరాలు ఆపరేషన్ థియేటర్ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. హాలియా పట్టణానికి అనుముల, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్), నిడమనూరు, గుర్రంపోడు తదితర మండలాల నుంచి పేదలు వైద్య అవసరాల కోసం ఇక్కడికి వస్తుంటారు. అప్పటి ప్రభుత్వాలు నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో 30 పడకల ఆస్పత్రి ఉండాలనే లక్ష్యంతో నిర్మాణం చేసినప్పటికీ ప్రభుత్వాల మార్పుతో ప్రారంభానికి నోచుకోలేదు. ఆస్పత్రి నిర్మాణం కోసం 2006లో శంకుస్థాపన చేసినప్పటికీ సుమారు 18 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వ వైద్యం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్ తదితర పట్టణాలకు తరలి పోవాల్సి వస్తుందని పేదలు ఆవేదనకు గురవుతున్నారు. ప్రధానంగా హాలియా కేంద్రానికి కృష్ణపట్టి ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల ప్రజలు హాలియాలోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది.
దీంతో వైద్య సేవల నిమిత్తం రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సీజనల్ వ్యాధుల సమయంలో పేదలు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించడంతో రూ.వేలు ప్రైవేట్ దవాఖానలకు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్టుల పేరుతో పేదల నుంచి రూ.వేలు గుంజడంతో ఆర్థికంగా చితికి పోతున్నారు. 30 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలు అందే అవకాశం ఉండడంతో ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా పేద ప్రజలు ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పట్టణంలో ఉన్న 24గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం వందలాది మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారు.
సీజనల్ వ్యాధులతో కిటకిట..
సీజనల్ వ్యాధుల కారణంగా హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం వందల మంది రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. 24 గంటల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఇద్దరు డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్క డాక్టరే ఉండడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవడంతో పేదలకు వైద్య ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 30 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తే పలు రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో మిర్యాలగూడ నల్లగొండ హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తగ్గుతాయని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
18 ఏళ్లుగా నిర్మాణాలతోనే సరి..
హాలియా పట్టణంలో 30పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రభుత్వాలు మారినా నిర్మాణం పూర్తి కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2006లో మొదలైన ఆస్పత్రి నిర్మాణం 18 ఏళ్లుగా కొనసాగుతూనే ఉండడంతో ఉన్నత వైద్య సేవల కోసం ప్రజలు నిరీక్షిస్తూనే ఉన్నారు. 30 పడకల ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలతోపాటు మార్చురీ గది చిన్నపిల్లలకు వైద్య సేవలతోపాటు పలు రకాల సేవలు అందే అవకాశం ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30 పడకల ఆస్పత్రి ఉన్నతీకరణ పాత భవనంలో ఆధునీకరణ పనుల కోసం టీఎస్ఎంఐడీసీ ద్వారా రూ.3.50 కోట్లను కేటాయించడంతో ఆస్పత్రి మొదటి అంతస్తు నిర్మాణం కొనసాగుతుంది. నాటి ప్రారంభ సమయంలో సంవత్సరంలోపే భవన నిర్మాణం పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ నేటి వరకు భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఉన్నత వైద్య సేవల కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
భవన నిర్మాణ పనులపై నీలినీడలు..
హాలియాలో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం తిరిగి కనబడడం లేదు. గత ప్రభుత్వం రూ.3.50 కోట్లు కేటాయించినప్పటికీ ప్రభుత్వం నేటి వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడంతో నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మొదటి అంతస్తు భవన నిర్మాణం పూర్తికావస్తున్నప్పటికీ ఇంకా పాత భవనం ఆధునీకరణ పనులు మార్చురీ గది, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ తదితర పనులు ముందుకు సాగే అవకాశం కనపడడం లేదు. ఉన్నతీకరణ పనులు ప్రారంభమై సుమారు సంవత్సర కాలం గడిచినప్పటికీ నేటికీ నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ మిగిలిన పనులను కొనసాగించే అవకాశం సన్నగిల్లింది. దీంతో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయ్యేందుకు మరికొంత సమయం వేచి ఉండాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్ణీత సమయంలోపే పూర్తి చేస్తాం : లోకిలాల్, డీఈ
హాలియా పట్టణంలో 30పడకల ఆస్పత్రి ఉన్నతీకరణ పనులు గడువులోపే పూర్తి చేస్తాం. ఇప్పటికే భవన నిర్మాణ పనులు సుమారు మూడు వంతుల పని పూర్తి చేయడం జరిగింది. మిగతా మార్చురీ గది నిర్మాణం పాత భవనంలో ఆధునీకరణ పనులు చేయాల్సి ఉంది. నిధుల విడుదల వేగవంతం అయితే సకాలంలో పనులు పూర్తి చేస్తాం.