కేంద్రం జమిలి ఎన్నికలంటూ కుట్ర చేస్తుంది : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

by Shiva |   ( Updated:2023-09-13 07:32:02.0  )
కేంద్రం జమిలి ఎన్నికలంటూ కుట్ర చేస్తుంది : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
X

దిశ, నల్లగొండ : కేంద్రం జమిలి ఎన్నికలంటూ కుట్ర చేస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజలంతా పాల్గొన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న మరోసారి అమరులను స్మరించుకుందాం అని అన్నారు. కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికలంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు.

షెడ్యూల్ ప్రకారం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ, కేంద్రం ఎదో కుట్ర చేస్తూ.. జమిలి ఎన్నికల పేరుతో గందరగోళం సృష్టిస్తోందని అన్నారు. ప్రాంతీయ పార్టీలను గందరగోళంలోకి నెట్టి.. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటుందని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆరోపణలు చూస్తుంటే నవ్వొస్తుందని, సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో ద్రోహులు ఉన్నారని అంటున్న కాంగ్రెస్ వాళ్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ లో తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు చేరారని అన్నారు. షర్మిల కూడా కాంగ్రెస్ లో చేరబోతోందని, షర్మిల తెలంగాన వ్యతిరేకి కదా.. అని ప్రశ్నించారు. కేటీఆర్ సమర్థుడు, గొప్పగా చదువుకున్న వ్యక్తి అని అన్నారు. ఈసారి హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని అన్నారు. హైదరాబాద్ నేడు విశ్వ నగరంగా విరాజిల్లుతోందంటే అది మంత్రి కేటీఆర్ చలవేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీలు అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed