- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది శాశ్వతమా..? తాత్కాలికమా..?
దిశ, తుంగతుర్తి: కలిసొస్తుందని ముందుగానే భావించి హాత్ సే హాత్ జోడోయాత్రకు ఎవరికి వారే సిద్ధమైన నాయకులంతా ఒకేసారి సైలెంట్ అయ్యారు. వారంతా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్న పరిస్థితులు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. యాత్ర ప్రారంభానికి మొదట్లో ఎవరికి వారే-యమునా తీరే అన్న చందాగా ప్రవర్తించిన వారంతా ఇప్పుడు కిమ్మనడం లేదు. పైగా కొన్ని మండలాలలో తమకు తామే నిర్వహించిన జోడో యాత్రలు కూడా రద్దు చేసుకున్నారు. చివరికి అధిష్టానం చెప్పిన రోజే కదులుదాం అనే తరహాలో వారంతా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ ఆధ్వర్యంలో జోడో యాత్ర ఈనెల 6న తేదీన నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న లాంఛనంగా ప్రారంభించారు. దీనికి మోత్కూరు, అడ్డగూడూరు, శాలిగౌరారం, తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ మేరకు ఆరోజు స్థానిక పట్టాభి రామాలయంలో పూజలు నిర్వహించి మెయిన్ రోడ్డుతోపాటు మరో రెండు వీధులను కలియ తిరిగారు.
అనంతరం సూర్యాపేటలో లింగమంతుల జాతర కొనసాగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. తిరిగి యాత్ర ప్రారంభమయ్యే వివరాలను ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా యాత్రలో జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్నతోపాటు యాత్ర నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన గుడిపాటి నరసయ్య కూడా పలు రకాలుగా హెచ్చరికలు జారీ చేశారు. జోడో యాత్రలు ఇష్టానుసారంగా ఎవరికి వారే ఆయా మండలాలలో ప్రారంభిస్తే కుదరదని, దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ అంతా తామే తయారు చేస్తామని వివరించారు కూడా. ఇదిలా ఉంటే ఆధిపత్య పోరు సాగిస్తున్న గ్యాంగ్ లీడర్ లలో కొందరిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ అనుమతులు లేకుండా సొంత నిర్ణయాలతో ఎవరికి వారే ఇష్టానుసారంగా సమావేశాలు పెట్టడం దేనికి...? ఒకరిపై మరొకరు విమర్శలకు పాల్పడడం దేనికి..? అంటూ అక్షింతలు వేసినట్లు తెలిసింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.....
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంతకాలం అటు పార్టీ కార్యకర్తలకు గానీ ఇటు ప్రజలకు గానీ కనిపించని నేతలంతా ఏకఏకిగా ప్రత్యక్షమవుతున్నారు. ఒకరిద్దరు నేతలు అడపా దడపాగా ప్రజల మధ్యకు వచ్చిపోతూ మద్దతును పొందడానికే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పట్ల అనుకూలంగా ఉండడమే కాకుండా తుంగతుర్తి అసెంబ్లీ నుండి పోటీ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు ఎవరికి వారే ప్రచారాన్ని చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా తుంగతుర్తి అసెంబ్లీ నుండి గతంలో కంటే ఈసారి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న తుంగతుర్తిలో ఈనెల 6న జోడోయాత్ర ప్రారంభ సందర్భంగా పరోక్షంగా కేవలం పోటీదారుల సంఖ్యను బహిరంగంగా చెప్పుకొచ్చారు. పోటీదారుల సంఖ్య రెండు డజన్లకు తక్కువగా ఉండదని వివరిస్తూ టికెట్ ఎవరికి వచ్చిన అంతా కలిసి కట్టుగా పనిచేస్తూ అభ్యర్థి విజయానికి పాటుపడాలని చురకలాంటించారు. ముఖ్యంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులతో టికెట్ సాధించేవారు కొందరైతే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నవారు మరికొందరు ఉన్నారు. ఇవేకాకుండా నేరుగా ఢిల్లీ పెద్దల ద్వారా టికెట్ సాధిస్తాననే వారు మరికొందరు ఉన్నారు. ప్రధానంగా ఈసారి టికెట్ ఆశించే వారిలో గుడిపాటి నర్సయ్య, అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవి, జ్ఞాన సుందర్, ఇటిక్యాల చిరంజీవి తదితరులు ఉన్నారు. అంతేకాకుండా ఒకరిద్దరు ఎన్నారైలు కూడా ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా వినబడుతోంది.
ఒక్కొక్కరు ఒక్కో విధంగా....
ఈసారి టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారు. 2014లో ఎస్సీ రిజర్వుడ్ జాబితాలో చేరిన నాటినుండి తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పోటీ చేసే అవకాశం లభించడం లేదంటూ ఆవేదనను వెళ్ళ గక్కుతున్నారు. మరికొంతమంది మాత్రం తమ కుటుంబంతోపాటు తనకు ఊహ తెలిసిన నాటి నుండి కూడా కాంగ్రెస్ లోనే ఉంటున్నప్పటికీ పార్టీ పరంగా ఎదుగుదల మాత్రం లేదంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా టికెట్ ఆశిస్తున్న వారిలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వివరిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ వస్తే విజయం కూడా సులువుగానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు.
సద్దుమనుగుడు తాత్కాలికమా..? శాశ్వతమా..?
కలహాల కుంపట్లకు పేరొందిన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జోడో యాత్రపై జిల్లా అధిష్టానం చేసిన ప్రకటనతో గ్యాంగ్ లీడర్లుగా మారిన వారంతా సైలెంట్ లోకి వెళ్లిపోయారు. అయితే ఇది శాశ్వతమా..? తాత్కాలికమా..? అనే అంశాలు అందరిలో చర్చనీయాంశంగా మారాయి.