Yadadri Bhuvanagiri Collector : సర్వాయి పాపన్న పోరాటం ఆదర్శనీయం

by Aamani |
Yadadri Bhuvanagiri Collector : సర్వాయి పాపన్న పోరాటం ఆదర్శనీయం
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: బడుగు, పేద, బహుజనుల అభ్యున్నతి కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని, ఆచరణీయమని జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆ కాలంలోనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేదలు, బడుగు, బలహీనుల కోసం చేసిన పోరాటాలు, సంస్కరణలను అందరూ ఆదర్శంగా తీసుకొని ఆచరించాలన్నారు. వారు చూపిన బాటలో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆర్థిక బలోపేతానికి అందజేస్తున్న అన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలను వారికి అందేలా మనం కృషి చేస్తేనే సర్వాయి పాపన్న గౌడ్ కు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.

గీత కార్మికులకు సేఫ్టీ మోకుల కిట్స్ పై త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి బీమా చెల్లించేందుకు వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని, వృత్తుల మీద ఆధారపడిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని వెంటనే అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా ఎక్సైజ్ అధికారి సైదులు, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శ్యాంసుందర్, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు కొత్త నరసింహ స్వామి, వివిధ బీసీ సంఘాల, సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story