Tourism : వెక్కిరిస్తున్న పర్యాటకం.. అధికారుల ఇష్టారాజ్యం..

by Sumithra |
Tourism : వెక్కిరిస్తున్న పర్యాటకం.. అధికారుల ఇష్టారాజ్యం..
X

దిశ, నల్లగొండ బ్యూరో : ఇంటిని చూసి ఇళ్లాలిని చూడాలి అంటే.. ఇంటిలోని వస్తువుల అమరికను బట్టి ఆ ఇంటి ఇల్లాలి ప్రవర్తను అర్థం అర్థం చేసుకోవచ్చు" అంటారు పెద్దలు. ఈ సామెత సరిగ్గా నల్లగొండ జిల్లాలో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయానికి ( Tourism Office ) అచ్చు గుద్దినట్లు సరిపోతుందని చెప్పొచ్చు. అనుకూలంగా ఉండేందుకు ప్రభుత్వం నిర్మించిన కార్యాలయాన్ని కాదని శిథిలమై.. పై నుంచి పెచ్చులూడుతున్న గదిలో ఉంటున్నారు. పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అధికారులు ఉన్న ఆనవాళ్లను కూడా లేకుండా చేస్తున్నారని విమర్శలున్నాయి. తాము రెగ్యులర్ గా కార్యాలయానికి రావడానికి బస్టాండ్ కు అతి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ పాత భవనంలో శిథిలావస్థలో ఉన్న ఒక గదిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. పానగల్ మ్యూజియం వద్ద లక్షలు పోసి నిర్మించిన భవనాన్ని గాలికి వదిలేశారు.

జిల్లాలో పర్యాటక ప్రాంతాలు..

తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ( Nalgonda District) పర్యాటక ప్రాంతానికి ఎంతో పేరుంది. నల్లగొండ జిల్లా పర్యాటక శాఖ అధికారి పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం ఈ నాలుగు జిల్లాలు ఇక్కడ అధికారి పరిధిలోనే ఉంటాయి. ఈ నాలుగు జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు. నాగార్జునసాగర్ బుద్ధవనం, దేవరకొండ కోట, భువనగిరి కోట, ఫణిగిరి, పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయం, పానగల్ మ్యూజియం, వాడపల్లి సంగమం, కొలనుపాక జైన దేవాలయం, కొలనుపాక మ్యూజియం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లాంటి ఎంతో ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఎంతోమంది రాజులు నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి.. వీటి అభివృద్ధికి ప్రభుత్వం కూడ అనేక రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు.

పట్టింపు లేని అధికారులు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పర్యాటక ప్రాంతంగా ఉన్న పేరుకు తగిన విధంగా అభివృద్ధి కాలేదనే భావన జిల్లా ప్రజల్లో ఉంది. దానికి ప్రధాన కారణం జిల్లా పర్యాటక శాఖ అధికారులే అని చెప్పొచ్చు.. అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్న పర్యాటక ప్రాంతాల్లో కొన్నింటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పానగల్ లో ఉన్న మ్యూజియం చుట్టూ చెత్తాచెదారం, గడ్డి, కాకుండా అందులో నరికి వేసిన చెట్ల చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసి అపరిశుభ్రత కేంద్రంగా ఉంది. ఆ పక్కనే టూరిజం ఇన్ఫర్మేషన్ ఆఫీస్ పేరుతో సుమారు రూ. 25 లక్షలు పెట్టి కార్యాలయం నిర్మించారు. ఆ కార్యాలయం చుట్టూ కూడా పిచ్చి గడ్డి పెరిగి, పాములు, తేళ్లు ఇతర క్రిమి కీటకాలు స్వైర విహారం చేస్తున్నాయని అక్కడ పనిచేసే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టూరిజం ఇన్ఫర్మేషన్ కార్యాలయంలో ఉండాల్సిన జిల్లా అధికారులు పాత జిల్లా పరిషత్ భవనంలోని ఓ శిథిలావస్థకు చేరిన ఓ గదిలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ, కొత్త కార్యాలయంలో ఒక జూనియర్ అసిస్టెంట్ ను అక్కడ కూర్చో బెడుతున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం కూడా లేదు. అంటే లక్షలు ఖర్చు చేసి నిర్మించిన భవనం కంటే తమకు అనుకూలమైన కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనంలోనే ఉండడానికి అధికారులు ఇష్టపడుతున్నారు తప్ప కొత్త భవనంలో ఉండడానికి మాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అంటే తమ కార్యాలయం ఉన్న చోటునే పరిశుభ్రంగా ఉంచుకోలేని పర్యాటక శాఖ అధికారులు ఇక జిల్లా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తారంటే నమ్మడం కష్టమే.

నాగార్జునసాగర్ నిర్మాణం జరిగే సమయంలో అక్కడి పనులను పర్యవేక్షించడానికి అధికారుల కోసం రెండు అతిథి గృహాలను నాగార్జునసాగర్ పైలాన్ లో నిర్మించారు. అయితే ప్రాజెక్టు కట్టడం పూర్తయిన తర్వాత ఆ రెండు గెస్ట్ హౌస్ లను ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యాటక శాఖకు అప్పగించారు. ఆ తర్వాత గెస్ట్ హౌస్ లను పర్యాటక ప్రాంతాలుగా చూసుకోవాల్సిన అధికారులు గాలికి వదిలేయడంతో ఎప్పుడు ఆ భవనాలు నేలమట్టం కావడంతో పాటు ఆ స్థలమంతా అన్యాక్రాంతమైంది. ఇదంతా తెలిసి కూడా అధికారులు ఒక్కరు నోరు మెదపలేదని విమర్శలు ఉన్నాయి.

నవంబర్ 1వ తేదీన జరిగే పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వాడపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చుట్టూ భక్తుల సౌకర్యార్థం కోసం శుభ్రం చేయించారు. శుభ్రం చేయిస్తూ పెరిగిన పిచ్చి మొక్కలను, చెట్లను తొలగిస్తుంటే సుమారు 7వ శతాబ్దం నాటి "పాలీ లిపి " కి సంబంధించిన శాసనం బయటపడింది. అంతే కాకుండా అక్కడే ఉన్న కాకతీయుల దుర్గం, చుట్టూ ఉన్న ప్రహారీ గోడ కనపడింది. ఇవన్నీ కూడా అందరినీ ఆకర్షింప చేస్తున్నాయి. కానీ పర్యాటక శాఖ అధికారులు ఇలాంటి వాటిని వెలికి తీసేందుకు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకు వేసిన సందర్భంలేదు..

ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో అనేకమైన పురాతన శిలా శాసనాలు కట్టడాలు ఎన్నో మరుగునపడి ఉన్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story