ట్యాబ్‌ల కొనుగోలులో రూ. 1.52 లక్షలు స్వాహా.. ఆడిట్‌లో నిగ్గు తేల్చిన అధికారులు..!

by Satheesh |   ( Updated:2024-07-23 17:18:34.0  )
ట్యాబ్‌ల కొనుగోలులో రూ. 1.52 లక్షలు స్వాహా.. ఆడిట్‌లో నిగ్గు తేల్చిన అధికారులు..!
X

దిశ, నల్లగొండ బ్యూరో: నిత్యం పేదల కోసం పనిచేస్తామని చెప్పుకోవడం.. ఆచరణలో మాత్రం ఏ పని చేసినా అందులో కమిషన్ తీసుకోకుండా వదలకపోవడం. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే.. మీ సంగతి చూస్తా.. అంటూ బెదిరింపులకు గురి చేయడం. ఇది మండల స్థాయిలో పని చేసే ఓ అధికారి తీరు. గత వేసవిలో వలిగొండ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని ఆన్లైన్లో నమోదు చేయడానికి దాదాపు 20 ట్యాబ్‌లు కొనుగోలు చేశారు. ఇందులో 19 ట్యాబ్‌లకు రూ.24000, మిగిలిన ట్యాబ్‌కు రూ.16 వేలుగా లెక్కల్లో రాశారు. ఈ ట్యాబులు కొనుగోలు మండల స్థాయి అధికారి చేతుల మీదుగా జరిగినట్లు సమాచారం. వాస్తవంగా ఒక్కొక్క ట్యాబుకు రూ.16వేలు మాత్రమే.. కానీ రూ.24 వేలకు కొనుగోలు చేసినట్లు కార్యాలయంలో బిల్లులు పెట్టినట్లు సమాచారం. దాని ప్రకారం ట్యాబ్‌ల పేరుతో రూ. 1.52 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఈ మధ్య జరిగిన ఆడిట్లో కూడా స్పష్టంగా బయటికి వచ్చింది.

ఆడిట్ అధికారులు కూడా తప్పుడు బిల్లులు సమర్పించారని, ఈ బిల్లులు వాస్తవం లేదని క్లియర్‌గా నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ అధికారి మొదటి నుంచి అక్రమ వసూళ్లలో ఆరితేరారని మండలంలో ఏ మహిళా సంఘం నాయకురాలిని అడిగిన చెప్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. వేసవిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి కూడా ప్రతి కేంద్రానికి రూ.20 వేల నుంచి 30 వేల వరకు జబర్దస్త్‌గా వసూలు చేశారని అప్పట్లో పెద్ద ఆరోపణలు వినిపించాయి. డబ్బులు అకౌంట్‌లో వేస్తే ఎక్కడ దొరికిపోతామోనని.. నేరుగా వెళ్లి డబ్బులు తీసుకోవడం ఆ అధికారి స్టైల్. గతంలో అతనిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ జిల్లా స్థాయిలో ఉన్న అధికారి వల్లే ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.

Advertisement

Next Story