దళారుల పర్వం…మధ్య వర్తులతో అధికారుల చేతివాటం

by Kalyani |
దళారుల పర్వం…మధ్య వర్తులతో అధికారుల చేతివాటం
X

దిశ, నల్గొండ బ్యూరో: ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలలో ప్రధానమైనది రిజిస్ట్రేషన్ శాఖ. ఈ శాఖలో అధికారుల చేతివాటం లేనిదే పని కావడం లేదు. చేతికి మట్టి అంటకుండా మధ్యవర్తుల ద్వారా జేబులు నింపుకుంటున్నారు. భూముల క్రయ, విక్రయ లావాదేవిలలో రిజిస్ట్రేషన్ చలానా రూపంలో లక్షల రూపాయలు ప్రభుత్వానికి జమ అవుతుంటే తమకు తగ్గట్టుగా ఆదాయం పెంచుకుంటున్నారు. డాక్యూమెంట్లు సిద్దం చేసే రైటర్లకే కార్యాలయంలో అధికారులు రైట్ చెబుతున్నారు. దీంతో వాళ్ళు చెప్పిందే త్వరగా పనులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది మిర్యాలగూడలోని రిజిస్ట్రేషన్ శాఖ అదికారుల వసూళ్ల పర్వానికి నాంది గా నిలుస్తుంది.

డాక్యుమెంట్ రైటర్లదే హవా :

మిర్యాలగూడలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనం చుట్టూ ఉన్న డాక్యుమెంట్ రైటర్లదే హవా కొనసాగుతుంది. కార్యాలయం దగ్గర సుమారు 20 షాపులకు పైగా డాక్యుమెంట్ లు తయారీ చేసే మధ్యవర్తులున్నారు. రోజుకు ఈ కార్యాలయం లో సుమారు 30 నుంచి 50 డాక్యుమెంట్ లు రిజిస్ట్రేషన్ లావాదేవిలు జరుగుతుంటాయి. డాక్యుమెంట్ లు తయారు చేసే దళారులు చలానా ఖర్చులతో పాటు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం అదనంగా చార్జీలు వసూళ్లు చేస్తున్నారు. ఒక్కొ డాక్యుమెంట్ కు కార్యాలయం ఖర్చులతో కలిపి 3 వేల నుంచి 5 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. వసూళ్లు చేసిన మొత్తంలో రూ. వెయ్యి రూపాయల నుంచి 3 వేల వరకు అధికారులకు అప్పగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అంతేకాకుండా ఏ ఏ సెక్షన్ లో ఎవరి వాటాను వాళ్లకు సాయంత్రం లెక్కలు చేసి దళారులు అప్పగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల సామాన్య ప్రజల రిజిస్ట్రేషన్ కంటే దళారుల పైరవీకే త్వరగా పని చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లో భాగంగా సంతకాల సమయంలో అధికారుల టేబుళ్ల ముందర దళారులే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. నేరుగా క్రయ విక్రయ దారులతో సంబంధం లేకుండా దళారుల ద్వారనే జేబులు నింపుకుంటున్నారు. దీంతో అధికారుల ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల మాదిరిగా సాగుతుంది. ఇప్పటికైన అధికారులు పై చర్యలు తీసుకొని దళారులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

రిజిస్ట్రేషన్ ల లో అక్రమాలు ?

దళారుల సూచనల మేరకు రిజిస్ట్రేషన్ ల లో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు, గృహ రుణాలు అధికంగా ఇస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో వేములపల్లి ,మిర్యాలగూడ రూరల్, దామరచర్ల , అడవిదేవులపల్లి, మిర్యాలగూడ మున్సిపాలిటీ ఉన్నాయి. అయితే పట్టణ, రూరల్ ప్రాంతాల లో చాలా మంది రుణాల కోసం గృహల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అయితే గృహాలకు సంబంధించిన సరియైన పత్రాలు లేకున్న ఫైనాన్స్ ప్రతినిధులు ,డాక్యుమెంట్ రైటర్లతో చేతులు కలిపి అధికారులకు ముడుపులు అందజేసి అక్రమ రిజిస్ట్రేషన్ లు చేస్తున్నట్లు తెలిసింది.

గ్రామ పంచాయితీ కార్యదర్శి నివాస ధృవీకరణ పత్రం తో పాటు విద్యుత్ బిల్లు రేషన్ కార్డు జత చేయల్సి ఉన్నప్పటికి ఆ పత్రాలలో కొన్ని పత్రాలు లేకపోయినా గృహల రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు అధికారులకు ఒక్కొక్క ఫైల్ కు రూ. 2000 వరకు ముడుపులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా తీసుకుంటున్నట్లు తెలిసింది. కార్యాలయ ఉద్యోగులకు ,సిబ్బంది కి చెల్లింపులు చేస్తుండటంతో చూసి చూడనట్లుగా పని చేస్తున్నారని ఆరోపణలున్నాయి. దీంతో లబ్ధిదారుల నుంచి వేల రూపాయలు ఖర్చు చేయిస్తూ దండుకుంటున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed